వైెెఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి, ఆ పార్టీకి తాజాగా రాజీనామా చేసిన గట్టు శ్రీకాంత్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగిన సమావేశంలో తన రాజీనామాను ప్రకటించిన ఆయన తన రాజకీయ భవిష్యత్ ను త్వరలో ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో తాను త్వరలో ఓ జాతీయ పార్టీలో చేరుతానని కూడా ప్రకటించారు. అది బీజేపీయేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
మంచి ముహూర్తం చూసుకొని ఓ జాతీయ పార్టీలో చేరుతానని ఆయనే స్వయంగా ప్రకటించడం గమనార్హం. దేశం కోసం, జాతి కోసం సమాజం కోసం ఆలోచించే పార్టీలో చేరుతానని స్వయంగా వెల్లడించారు. 2023లో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారు. బీజేపీ భావజాలం నుంచే వచ్చిన ఆయన మళ్లీ మాతృ సంస్థలోకే వెళ్లే అవకాశముందని భావిస్తున్నారు.
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం నల్లగొండ ఉమ్మడి జిల్లాలో యాదాద్రికి నిధులు ఇవ్వడం తప్పా, ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. నల్లగొండ జిల్లాను సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలపైనా గట్టు స్పందించారు. అభివృద్ధి కావాలో.. డబ్బు కావాలో అక్కడి ఓటర్లు తేల్చుకోవాలని హితవు పలికారు.
రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా నేటికీ నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ గిరిజన నిరుద్యోగి ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్నాడంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని అన్నారు.