శ్రీలంక అధ్యక్షుడు గొటబయ ఎక్కడ? మాల్దీవుల నుంచి మరో ఆసియా దేశానికి పరారీ?

రచ్చబండ : శ్రీలంక సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ దేశ ప్రజల నుంచి పాలకులకు నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. అధ్యక్షుడు గొటబయ దేశం విడిచి వెళ్లిపోకుండా విమానాశ్రయంలోనూ ప్రజలు కాపుకాచారు. ఈ దశలో ప్రజల నుంచి తప్పించుకొని ఆయన మాల్దీవులకు వెళ్లినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లారని ప్రశ్నార్థకంగా మిగిలింది.

శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే రాజీనామా చేయడానికి కొన్ని గంటల ముందు బుధవారం దేశం విడిచి మాల్దీవులకు వెళ్లారు. గొటబయతో పాటు ఆయన భార్య, ఇద్దరు అంగరక్షకులు వెళ్లారు.

వారంతా శ్రీలంక వైమానిక దళానికి చెందిన విమానంలో వెళ్లారని ఇమ్మిగ్రేషన అధికారి తెలిపారని ఓ ప్రముఖ వార్తా సంస్థ తెలిపింది. వారు అక్కడి నుంచి మరో ఆసియా దేశానికి వెళ్లే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ దశలో శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే బాధ్యతలు చేపట్టారని తాజా సమాచారం.