రాజ్యసభ అభ్యర్థుల షార్ట్ లిస్టు?

తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపే ముగ్గురు అభ్యర్థుల విషయంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటికే వడపోతల అనంతరం కొందరి పేర్లతో షార్ట్ లిస్టు బయటకొచ్చినా అసలు అభ్యర్థులు ఇంకా ఫైనల్ కాలేదు. గడువు సమీపిస్తుండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.

బీసీ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఉప ఎన్నిక కోసం ఈనెల 19న నామినేషన్లకు చివరి గడువు. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 30న పోలింగ్ జరగనుంది.

అదే విధంగా వచ్చే నెలలో రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు పదవీ కాలం ముగియనుంది. ఆయా స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. వాటికోసం ఇదే నెల 24 నుంచి 31వరకు నామినేషన్ల స్వీకరణ గడువు ఉంది.

ఇప్పటికే ఒక పేరు ఖారారైనట్లు తెలిసింది. నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదర్ రావు పేరు దాదాపు ఖరారైంది. ప్రకటించడమే తరువాయి. మొదటి విడత నామినేషన్ కు ఒకరోజు ముందే అంటే 18న ఆయన పేరును వెల్లడించే అవకాశం ఉంది.

మరో ఇద్దరు అభ్యర్థుల విషయంలో ఇంకా ఒక కొలిక్కి రాలేకపోయారు. జాతీయ స్థాయిలో అవసరార్థం సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావించారని ప్రచారం జరిగింది. అయితే సొంత పార్టీ నుంచి ఆశావహులు ఎక్కువగా ఉండటంతో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

అదే విధంగా ఖమ్మం జిల్లాలో క్యాడర్ బలం ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కూడా రాజ్యసభకు పంపే ప్రతిపాదనకు మొగ్గు చూపినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆయన రాష్ట్రంలో ప్రాధాన్యమున్న పదవే కావాలని, రాజ్యసభ పదవీ కాలం తక్కువగా వస్తే ప్రాధాన్యం ఉండదని అధిష్టానానికి తేల్చి చెప్పారని ప్రచారం.

దళితబంధు విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులును రాజ్యసభకు పంపే విషయం పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. అయితే అంతకు ముందే ఉన్న నేతల్లో అసహనం రగులుతుందని చిన్న అనుమానంతో కాస్త వెనక్కి తగ్గినట్లు చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉండగా కేంద్రంలో పార్టీ వాదనను బలంగా వినిపించేందుకు ఒకరు కావాలని కేసీఆర్ మదిలో ఉన్నట్లు తెలుస్తోంది. దానికోసం తన కూతురు కవితే కరెక్టని ఆయన భావిస్తున్నారని తెలిసింది. ఎన్నికల సమయం కావడంతో కవితను కూడా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకం చేయాలని భావిస్తున్నారు.

అయితే పైవారిలో ఆయా అభ్యంతరాలపై కేసీఆర్ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. దీవకొండ దామోదర్ రావును మినహాయిస్తే మిగతా అభ్యర్థులను ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. మొదటి విడతలో దీవకొండతో నామినేషన్ వేయించాక మలి విడత కోసం ఆలోచించొచ్చని అనుకుంటున్నారు.

అయితే వడపోత తర్వాత షార్ట్ లిస్టులో కొందరి పేర్లు ఉన్నాయి. వారిలో ఓసీ సామాజికవర్గం నుంచి కవిత, పొంగులేటితో పాటు సీఎల్ రాజం, పార్థసారథి పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్సీ సామాజిక వర్గం నుంచి మోత్కుపల్లితో పాటు మంద జగన్నాథం, బాలమల్లు ఉన్నారు. ప్రకాశ్ రాజ్ తో పాటు బీసీ సామాజిక వర్గం నుంచి పీఎల్ శ్రీనివాస్, ఆకుల లలిత పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిరాకరిస్తే ఎవరికి ఇస్తే లాభముంటుందని కూడా ఆలోచన చేసినట్లు సమాచారం. మండవ వెంకటేశ్వరరావు, నరేంద్రనాథ్ చౌదరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఏదేమైనా కేసీఆర్ మదిలో ఎవరున్నారనే విషయంపై వారంలోగా కొలిక్కి వచ్చే అవకాశముంది.