Home Latest News కుర్రో.. కుర్రు.. దేవుళ్లకే ఎరుక చెప్పిన నాంచారమ్మ

కుర్రో.. కుర్రు.. దేవుళ్లకే ఎరుక చెప్పిన నాంచారమ్మ

• ములుగు జిల్లా రామానుజాపురంలో వెలిసిన నాంచారమ్మ అమ్మవారు
• మహిమాన్విత దైవంగా విశేష పూజలు
• 800 ఏళ్ల క్రితం నిర్మించబడిన పురాతన ఆలయం
• 16న రామానుజాపూర్ లో జాతర
• నాలుగు రాష్ట్రాల నుంచి తరలిరానున్న ఎరుకల కులస్తులు
• సౌకర్యాల కల్పనలో పాలకుల చిన్నచూపు

వెంకటాపూర్ (రామప్ప) : కుర్రో.. కుర్రు.. అంటూ దేవుళ్లకే ఎరుక చెప్పింది నాంచారమ్మ తల్లి. అంతటి చరిత్ర కలిగిన ఆ అమ్మవారి ఆలయం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామానుజాపురం గ్రామంలో ఉంది. తమ పాలిట కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీరుస్తూ అండగా నిలుస్తోందని భక్తులు నమ్ముతారు.

కాకతీయ రాజుల పాలనా కాలంలో 800 ఏళ్ల క్రితం రామప్ప ఆలయంతో పాటు రామానుజాపురం గ్రామంలో ఎరుకల నాంచారమ్మ ఆలయం (పంచ కూటాలయం) నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో పూజలకు నోచుకోక నిరాదరణకు గురికాగా చుట్టుపక్కల ఉన్న పంట పొలాల రైతులు మాత్రమే మొక్కులు చెల్లించుకునేవారు.

పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణానికి చేసిన ప్రయత్నాలు ఆలాయాన్ని విప్పి కుప్ప పెట్టేందుకే సరిపోయాయి. దీంతో అందమైన శిల్ప సంపద మట్టిలో కలుస్తోంది. 2018లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరుకల కులస్తులను ఏకం చేసిన లోకిని రాజు మహిమాన్విత శక్తులు కలిగిన నాంచారమ్మ తల్లికి ప్రతి ఏటా జాతర నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

నాలుగు రాష్ట్రాల నుంచి భక్తల రాక
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా నాంచారమ్మ జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ప్రతీ ఏటా వైశాఖ పౌర్ణమికి జాతర నిర్వహిస్తుండగా కుర్రో.. కుర్రు.. అంటూ సోది చెప్పేందుకు ఎరుకల యువతులు, మహిళలు, వృద్ధులు నాంచారమ్మ వేషధారణలో కనిపిస్తారు. యువకులు బాణాలు చేతబట్టి ఏకలవ్యుని వేషధారణలో జాతరలో పాల్గొంటారు.

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం
వైవిధ్యమైన జీవన విధానం కలిగిన ఎరుకల కులస్తులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా జాతర నిర్వహిస్తారు. లిపిలేని వీరి భాష ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రధాన రహదారి నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో పంట పొలాల మధ్య ఉన్న ఆలయానికి డప్పు చప్పుళ్లు, బోనాలతో తరలి వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. చుట్టుపక్కల గ్రామస్తులు ఆరు రోజులపాటు మొక్కులు చెల్లిస్తారు. ఏడో రోజు తిరువారం పండుగతో జాతర ముగుస్తుంది.

సౌకర్యాల కల్పనలో విఫలం
ఐదేళ్లుగా జాతర నిర్వహిస్తున్నా ఇక్కడికి వచ్చే భక్తుల కోసం కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు, స్థానిక అధికారులు పూర్తి నిర్లక్ష్యం చూపుతున్నారు. జాతర వరకు పక్కా రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు జాతర సందర్భంగా తాగునీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 16న నిర్వహించే జాతర కోసం నాంచారమ్మ జాతర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆలయ ప్రాంతంలో భక్తులకు ఏర్పాట్లు చేస్తున్నారు.


ప్రభుత్వం దృష్టి సారించాలి
కాకతీయుల కాలంలో నిర్మించిన నాంచారమ్మ ఆలయం అభివృద్ది పై ప్రభుత్వం దృష్టి సారించాలి. నాలుగు రాష్ట్రాల భక్తులు వచ్చే జాతరకు సౌకర్యాలు కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో ఉన్న ఎరుకల కులస్తులు జరుపుకునే జాతర పట్ల చిన్న చూపు చూడడం తగదు.

– లోకిని రాజు, నాంచారమ్మ ఆలయ కమిటీ చైర్మన్

—————————————————————————–
భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం
నాంచారమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఐదేళ్లుగా జాతర నిర్వహించేలా లోకిని రాజు ఆధ్వర్యంలో ఐక్యంగా పని చేస్తున్నాం. సౌకర్యాలు కల్పిస్తే జాతరకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది.

– కేతిరి బిక్షపతి, ఎరుకల సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు