కాంగ్రెస్ సంచలన నిర్ణయాలు

• ఉదయ్ పూర్ డిక్లరేషన్

కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయాలు తీసుకుంది. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త రూపుదిద్దుకోనుంది. రాజస్థాన్ రాష్టంలోని ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు జరిగిన చింతన్ శిబిర్ ఆదివారం నాటితో ముగిసింది. ముగింపు సదర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆమోదించిన కీలక నిర్ణయాలను ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ వెల్లడించారు.

ఆరు కమిటీలు ప్రతినిధుల ముందుంచిన వాటిలో 20 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. వాటిలో ప్రధానంగా ఒకే కుటుంబానికి ఒకే టికెట్ ఇవ్వాలని సంచలన నిర్ణయం ప్రకటించారు. 50 ఏళ్లలోపు వయసున్న నేతలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని తీర్మానించారు. పార్టీ పదవుల్లో ఐదేళ్ల పాటు కొనసాగాలి. ఆ తర్వాత మూడేళ్లు విరామం ఉంటుంది.

ప్రతీ రాష్ట్రంలో 90కి.మీ. పాదయాత్ర
రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పాదయాత్ర ఉంటుంది. ప్రతీ రాష్ట్రంలో 90కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర కొనసాగుతుంది. పార్టీ అధ్యక్షుడికి సహాయంగా వివిధ కమిటీల ఏర్పాటుకు సూత్రప్రాయంగా నిర్ణయించారు.

పేపర్ బ్యాలెట్ రావాలి
ఈవీఎంలపై చింతన్ శిబిర్ లో సుధీర్ఘ చర్చ జరిగింది. ఈవీఎం వ్యవస్థపై రాజకీయ తీర్మాణానికి ఆమోదించారు. పేపర్ బ్యాలెట్ తీసుకొచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్ర దేశంలో మరే పార్టీకి లేదని రాహుల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కాంగ్రెసుకు ప్రజలతో బంధం తెగింది
కాంగ్రెస్ పార్టీకి ప్రజలతో ఉన్న బంధం తెగిపోయిందని ఆ పార్టీ శిబిరంలో ఒప్పుకుంది. మళ్లీ ఆ బంధాన్ని పునరుద్ధరించాలని తీర్మానించింది. ప్రజలతో సన్నిహిత సంబంధాలు పెంచుకోవాలని నేతలకు పిలుపునిచ్చింది. యాత్ర సందర్భంగా పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆ పార్టీ సూచించింది.

ప్రజల మధ్యలోకి వెళ్లాలి
కాంగ్రెస్ నేతలంతా ప్రజల మధ్యలోకి వెళ్లాలి. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి. సీనియర్లు, జూనియర్లు అని తేడా లేకుండా చెమటోడ్చి పని చేయాలి. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలి.. అని ఆ పార్టీ నేతలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

బీజేపీ పాలనలో అణిచివేతలు పెరిగాయి
బీజేపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అణిచివేతకు గురయ్యారు. ప్రజలు తమ అభిప్రాయాలను చెప్పడం కూడా నేరంగా మారింది. ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారు. పద్ధతి ప్రకారం వ్యవస్థలను నాశనం చేస్తున్నారు. బీజేపీ పాలనలో దళితులకు స్థానం లేకుండా పోయింది.. అని రాహుల్ గాంధీ తన ప్రసంగంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.