చెద(డు) పురుగులు
సమాజంలో విపరీత ధోరణులు
బంధాలను హరిస్తున్న వివాహేతర బంధాలు
కట్టుకున్న వారినే కాదు కన్నవారినీ బలితీసుకుంటున్న వైనం
వివాహేతర బంధాలు తోటి బంధాలు, బంధుత్వాలతో పాటు పేగుతెంచుకొని పుట్టిన వారినీ బలి చేయజూస్తున్నాయి. ఇలాంటి ఘటనలు సమాజంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. తెలిసే జరుగుతున్న ఇలాంటి విపరీత ఘటనలతో సభ్యసమాజమే తలదించుకునే పరిస్థితులు దాపురిస్తున్నాయి.
మహారాష్ట్రలోని ఓ పట్టణంలో ఓ మహిళ తన వివాహేతర బంధం కొనసాగేందుకు తన కన్నకూతురి శీలాన్ని ఒకడు దోచుకునేలా చేయడమే గాక ఆ బాలిక జీవితాన్నే ఫణంగా పెట్టాలనుకుంది. చివరకు ఆ బాలిక తానే చొరవ తీసుకోవడంతో ఆ నరకకూపం నుంచి బయటపడగలిగింది. ఆ రాకాసి రక్కసులకు జైలు గోడలే గతి అయ్యాయి.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఇటీవల జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 40 ఏళ్ల వయసున్న ఓ మహిళ తన భర్తతో విభేదాల కారణంగా వేరుగా ఉంటోంది. ఆమెతో పాటు తన 17 ఏళ్ల కుమార్తె, మరో కొడుకు కూడా ఉంటున్నారు. ఈ సమయంలో ఆమహిళకు 52 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
గత 2020 ఆగస్టులో ఆ 52 ఏళ్ల వ్యక్తి సదరు మహిళతో మాట్లాడేందుకు వారి ఇంటికి వెళ్లాడు. అదే సమయంలో ఆమె తన కొడుకును బంధువుల ఇంటికి పంపింది. ఈ సమయంలో ఆమె ప్రేమికుడు ఆ మహిళ కూతురిపై లైంగిక దాడికి దిగాడు.
దిగ్భ్రాంతికరంగా జరిగిన ఈఘటనతో ఆ బాలిక ప్రతిఘటించింది. కానీ ఆ బాలిక తల్లి ఆ వ్యక్తికి లొంగిపొమ్మని కూతురుకు చెప్పింది. ఇలా ఏతల్లీ తన కూతురుకు చెప్పకూడని విషయం చెప్పింది ఆ కనికరం లేని తల్లి. ఈ ఘటన తర్వాత నిందితుడు ఆ బాలికపై రెండుసార్లు లైంగికదాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా, నేరం గురించి ఎవరికీ చెప్పొద్దని అతను ఆమెను బెదిరించాడు.
ఈ దశలో ఆ బాలిక వారి చెర నంచి పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే ఆమెకు ఎక్కడా సరైన ఆశ్రయం దొరకలేదు. దీంతో ఆమె తిరిగి ఇంటికే రావాల్సి వచ్చింది. దీని తరువాత, ఆమె తల్లి దారుణమైన నేరాన్ని మూటగట్టుకోవాలనే పన్నాగం పన్నింది. కూతురికి తన ప్రియుడితో వివాహం చేసేందుకు ప్రయత్నించింది ఆ దుర్మార్గురాలు. ఇక ఎలాగైనా వారి బారి నుంచి బయటపడేందుకే నిర్ణయించుకుంది ఆ బాలిక. తన రక్షణ కోసం చాలా ప్రయత్నాలు చేసింది. చివరకు ఆమె చైల్డ్ హెల్ప్ లైన్‌కు డయల్ చేసి తనకు జరిగిన వివరాలు, జరగబోయే ఘోరాన్ని అధికారులకు చెప్పుకొని ఏడ్చింది. ఆ అధికారులు స్వయంగా వచ్చి ఆ బాలికను ఆ నరకకూపం నుంచి రక్షించారు.
ప్రాణాలతో బయటపడిన ఆ మైనర్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, ఆమె తల్లిని, తల్లి ప్రియుడిని అరెస్టు చేశారు. వారిద్దరినీ కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తరలించారు.
ఈ దశలో తండ్రి దూరమై, తల్లి జైలుపాలైన తర్వాత ఆ మైనర్ బాలిక, ఆమె తమ్ముడు అనాథలయ్యారు. ఇలాంటి చెడు వ్యసనాల వల్ల తన కుటుంబం చిన్నాభిన్నమై పోతుందనే విషయాన్ని గుర్తెరిగితే ఇలాంటి చెడు ఘటనలు పునరావృతం కావు.