శభాష్ పోలీస్.. మానవత్వం చాటుకున్న నల్లగొండ పోలీస్..

శభాష్ పోలీస్..

నల్లగొండ : మానవత్వం చాటుకున్నారు.. ఓ కుటుంబానికి బాసటగా నిలిచారు.. భవిష్యత్ లోనూ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.. ఇదీ 1989 బ్యాచ్ పోలీస్ అధికారుల వితరణ గుణానికి నిదర్శనం. ఓ ప్రమాదంలో తీవ్రగాయాలపాలై చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తోటి ఉద్యోగి కుటుంబానికి వారు అండగా నిలిచారు. వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా కేంద్రంలో నివాసముంటున్న కానిస్టేబుల్ అక్తర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. విధి నిర్వహణలో పాల్గొనలేని స్థితిలో ఉండటంతో పాటు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరికీ అర్హత లేక ఉద్యోగం లభించలేదు. ఈ దశలో మానసికంగా తీవ్రంగా కుంగిపోయిన ఆయన కుటుంబం ఆర్థిక సమస్యలతో అవస్థలు పడుతున్న విషయాన్ని తోటి బ్యాచ్ మేట్స్ తెలుసుకున్నారు. అందరూ కలిసి అక్తర్ కుటుంబానికి అండగా నిలుద్దామని నిర్ణయించుకున్నారు. అంతా కలిసి రూ.3,15,300 నగదును జమ చేసి గురువారం అక్తర్ కుటుంబానికి అందించారు. భవిష్యత్తులోనూ ఆదుకుంటామని అక్తర్ కుటుంబానికి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో బ్యాచ్ మేట్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు రామచందర్ గౌడ్, మూసి వెంకయ్య, జహంగీర్, జంగయ్య, శ్రీనివాస్, శౌరి, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు