తన మంత్రి వర్గంలో సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. తన మొదటి మంత్రి వర్గ కూర్పులోనూ ఇదే సామాజిక సమతూకాన్ని పాటించిన ఆయన మలి విడత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ అదే పాటించడం విశేషం.
వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏనాడూ మహిళా, బీసీ, ఇతర సామాజిక వర్గాలకు మంత్రి వర్గంలో సరైన వాటా దక్కలేదు. ముఖ్యంగా జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు ప్రాధాన్యమే లభించలేదు. ముఖ్యంగా ఎక్కువ మంది ముఖ్యమంత్రులు ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అటు రెడ్లకు, ఇటు ఖమ్మ సామాజిక వర్గాలకే ఎప్పుడూ పెద్దపీట దక్కేది.
గతంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వుడు స్థానాలే దక్కేవి. ఇతర చోట్ల ఒకటీ, అరా మాత్రమే ప్రధాన పార్టీల అధిష్టానాలు సీట్లు ఇచ్చేవి. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ఎమ్మెల్యే సీట్లు దక్కడం గగనమే. కొన్నిచోట్ల కొందరు బీసీలు ఎమ్మెల్యేలుగా గెలిచినా ఏదో ఓ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇచ్చి బీసీలకు పదవి ఇచ్చామని ప్రచారం చేసుకునేవారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మంత్రి వర్గంలో మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పించారు. ఇతర సమయాల్లో సరైన ప్రాధాన్యమే దక్కలేదు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా, పాలనా పరంగా ఎలాంటి వారైనా తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మాత్రం సామాజిక విప్లవమే తీసుకొచ్చారు. బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం ముదావహం. ఆయనకు విచక్షణాధికారం ఉన్నా తన సామాజిక వర్గానికి కేవలం నలుగురికే ఇచ్చి నిస్వార్థతను చాటుకోవడం విశేషం. తన తండ్రి లాగే నలుగురు మహిళలకు తన మంత్రి వర్గంలో చోటు కల్పించి మహిళా పక్షపాతిని అనిపించుకున్నారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో 25 మందికి చోటు కల్పించారు. వారిలో 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి ప్రాధాన్యం కల్పించారు. అదే విధంగా ఓసీలకు 8 మందికి, ఎస్సీలకు ఐదుగురికి, మహిళలకు నలుగురికి, ఎస్టీ, మైనార్టీ వర్గానికి చెందిన వారికి ఒక్కొక్కరి చొప్పున మంత్రివర్గంలో చోటు కల్పించారు.
గతంలో బీసీలలో కూడా ఆధిపత్య వర్గానికే ప్రాధాన్యం దక్కేది. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం మరో అడుగు ముందుకేసి బీసీలు, ఎస్సీలలో కూడా వివిధ వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. ఉప కులాల వారీగా మంత్రివర్గంలో చోటు కల్పించి ఆయా వర్గాలకు సాంత్వన చేకూర్చారు. దీంతో బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.