మినిస్టర్ రోజా భావోద్వేగం

ఆర్కే రోజా అను నేను.. అన్న కల నెరవేర్చుకున్న ప్రముఖ సినీ నటి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తీవ్ర భావేద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి ఉద్వేగంగా మాట్లాడి తన అభిమానాన్ని చాటుకున్నారు.

మంత్రి కావాలని ఎన్నాళ్ల నుంచో ఆమెకు కోరిక ఉంది. వైఎస్సార్ సీపీ కేడర్ లో కూడా బలంగా ఉంది. కానీ తొలి విడతలో ఆమెకు ఆ పదవి దక్కలేదు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పునర్వ్యవస్థీకరణలో భాగంగా రోజాకు మంత్రి పదవిని కట్టబెట్టారు.

ఆర్కే రోజా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా ఉద్వేగంతోనే ఉన్నారు. ఆమె ప్రమాణ పలుకులు కూడా నిబిడానందంతో గట్టిగా, స్పష్టంగా నిండుగా పలికుతూ తొణకకుండా ఆనందాన్ని బయటకు వ్యక్తపరుస్తూ చిరునవ్వులు చిందిస్తూ ప్రమాణం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి, గవర్నర్ కు అభివాదం చేసి వెళ్లిపోయారు.

అనంతరం సభా వేదిక వద్ద వివిధ చానళ్లతో భావోద్వేగంతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలు నిర్భయంగా వెల్లడించారు. రోజా అను నేను.. అన్న నా కల, ప్రజల కల నెరవేరింది.. ఎంతో ఉత్సాహంగా ఉంది..

ప్రజా సేవకు అంకితమవుతా.. జగనన్న అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు చొరవ చూపుతా.. నా బాధ్యతలను సక్రమంగా అమలు పరుస్తా.. అని హామీ ఇచ్చారు.

వైఎస్సార్ చనిపోయిన తర్వాత నేను సైలెంట్ అయ్యా. జగనన్న పార్టీ పెట్టే ముందు నెల్లూరు మీటింగుకు నన్ను పిలిపించారు. నాన్న తీసుకొచ్చిన మీరు సైలెంట్ గా ఉండొద్దు. పార్టీలోకి రండి.. జీవితాంతం తోడుగా ఉంటా అని జగనన్న నాకు మాటిచ్చారు.. అని రోజా చెప్పారు.

అసెంబ్లీలో నాకు అవమానం జరిగినప్పుడు జగనన్న తోడుగా నిలిచారు. నన్ను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే జగనన్న రాజకీయ పునర్జన్మను ఇచ్చారు. అలాంటి అన్న కోసం నా ప్రాణాలైనా అర్పిస్తా.. అని రోజా భావోద్వేగంతో చెప్పారు. వచ్చే ఎన్నికల్లోనూ జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు నేను శక్తివంచన లేకుండా కృషి చేస్తా.. అని తన లక్ష్యాన్ని వెల్లడించారు.