కొన్నిచోట్ల ఉన్నతాధికారుల వేధింపులు అంతా ఇంతా కాదు. కిందిస్థాయి ఉద్యోగులకు పని విషయంలో, సెలవుల మంజూరులో చుక్కలు చూపిస్తుంటారు. కొందరికి నిత్య వేధింపులు పరిపాటి. దీంతో ఎందరో కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది సతమతమవుతూ నలిగిపోతూనే ఉంటారు.
తెలివిగల వారు కొందరైతే మద్యంతో, నగదుసాయంతో మచ్చిక చేసుకొని వెసులుబాటు కల్పించుకుంటారు. అవి ఇచ్చుకోలేని, ఇవ్వడం తెలియని వారు మాత్రం బాసుల వేధింపులకు బలవుతూనే ఉంటారు. కానీ ఓ క్రూరుడి వింత కోరికకు ఓ కిందిస్థాయి ఉద్యోగి తన ప్రాణాన్నే బలితీసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లఖీంపూర్ లో జరిగిన ఈ ఘటన విస్మయం కలిగించకమానదు. అక్కడి విద్యుత్ శాఖలో ఓ కింది స్థాయి ఉద్యోగి బదిలీ కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ఎంతకూ కావడం లేదు. దీంతో అక్కడి పైఅధికారిని వేడుకోవడం తప్పలేదు. కాళ్లావేళ్లా పడ్డాడు. ఇదే అదనుగా భావించిన ఆ దుర్మార్గుడి కోరిక విన్న ఆ చిరుద్యోగి హతాషుడయ్యాడు.
ఆ దుర్మార్గపు అధికారి అడిగిన కోరిక విషయం చెప్పి పోలీసులను ఆశ్రయించాడు. అతడి ఆక్రందన వారిని కరిగించలేదు. తేలికగానే తీసుకున్నారు. పైఅధికారి అడిగిన కోరిక అతడి ఆత్మాభిమానాన్ని రోజూ చంపేస్తోంది. అంతర్మథనంతో రగిలిపోయాడు. డిఫ్రెషన్ కు లోనయ్యాడు. చివరకు ఓ నిర్ణయం తీసుకున్నాడు.
తాను లఖీంపూర్ లో పనిచేసే జూనియర్ ఇంజనీర్ కార్యాలయానికి వెళ్లాడు. తన ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలిపోతూనే తనకు జరిగిన విషయాన్ని అక్కడి వారికి వివరించాడు. జూనియర్ ఇంజనీరు, ఆయన సహాయకుడు తనను వేధిస్తున్నారని, పోలీసులను ఆశ్రయించినా ఫలితం రాలేదని చెప్పాడు.
‘‘నీకు ట్రాన్స్ ఫర్ కావాలంటే నీ భార్యను ఒకరోజు రాత్రికి నా వద్దకు పంపు’’ అని అన్నాడని మంటల్లో కాలుతూ ఆ నిస్సహాయుడు చెప్పాడు. బదిలీ కోసం నేను పైఅధికారిని కోరాను. ఎన్నిసార్లు కోరినా వినలేదు. వాడన్న మాటతోనే ప్రాణం తీసుకుంటున్నా.. అని అతడు మాటలు చాలించాడు.