ఈ సారి భద్రాద్రి కల్యాణం డిఫరెంట్

• భద్రాద్రిలో కనుల పండువగా రాములోరి కల్యాణం
• మూడేండ్ల తర్వాత మిథిలా స్టేడియంలో వేడుకలు
• తెలంగాణ ప్రభుత్వం, టీటీడీ నుంచి తలంబ్రాలు

ఖమ్మం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఆదివారం శ్రీసీతారామ కల్యాణ మహోత్సాహం కనుల పండువగా జరిగింది. మిథిలా స్టేడియంలో జరిగిన ఈ వేడుకలను తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. కరోనా ప్రభావంతో గత రెండేళ్లుగా ఆలయ ప్రాంగణంలో జరిపిన కల్యాణం తిరిగి మిథిలా స్టేడియంలో జరగడంతో మళ్లీ కళ వచ్చింది. దీంతో చాలాకాలం తరవాత భద్రాచలం పురవీధులు భక్తులతో కిటకిటలాడాయి.

గోదావరి తీరంలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, పక్కనే ఉన్న ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు సీతారాముల కల్యాణం తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

వేద మంత్రోచ్ఛరణాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తుల రామనామ స్మరణ నడుమ అభిజిత్ ముహూర్తాన వేదపండితులు శ్రీ సీతారాముల కల్యాణం జరిపించారు.

శ్రీ రామ భక్తుడైన భక్త రామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకుని రామయ్య పెండ్లి కొడుకుగా, సీతమ్మ పెండ్లి కుమార్తెగా దర్శనమిచ్చారు. సుముహూర్తాన జిలకర, బెల్లం పెట్టారు. అనంతరం మాంగళ్యధారణ జరిగింది.

ఆనవాయితీగా వస్తున్న రాములోరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ, రవాణా శాఖల మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పూవ్వాడ అజయ్ కుమార్ దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.

టీటీడీ తరపున వైవీ సుబ్బారెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

రెండేళ్ల తరువాత భక్తుల నడుమ జరిగిన కల్యాణ వేడుకలకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.  భక్తుల రద్దీ దృష్ట్యా కలెక్టర్ నేతృత్వంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు.

కల్యాణ వేడుకలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు, హైకోర్టు జడ్జి వెంకటేశ్వర్లు, భద్రాచలం ఖమ్మం జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, లింగాల కమల్ రాజు పాల్గొన్నారు.

అదే విధంగా ఖమ్మం, ములుగు కలెక్టర్లు వీపీ గౌతమ్, కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రూ, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్ దత్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఈవో శివాజీ, భద్రాద్రి ఇన్చార్జి సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఏఎస్పీ రోహిత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.