శభాష్ సరితా.. పేదింటి బిడ్డని వరించిన నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు

సూర్యాపేట, రచ్చబండ: కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. మహా పురుషులవుతారు.. అన్న మహాకవి మాటను నూటికి నూరుపాళ్లు నిజం చేసింది ఓ పేదింటి యువతి. ఒకటి, రెండు కాదు.. ఏకంగా నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి విశేష ప్రతిభ చాటింది. ఆ యువతిని ఊరు ఊరంతా అభినందనలతో ముంచ్చెత్తుతోంది. ఆమె విశేష ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఆమె ఇంట ఆనందం తాండవిస్తుంది.

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం భక్తళాపురం గ్రామపంచాయతీ పరిధి ఎర్రంశెట్టివారిగూడెం గ్రామానికి చెందిన గాజుల జానయ్య, పద్మల కూతురు సరిత పీజీ వరకు చదువుకున్నది. బీఈడీ కూడా పూర్తి చేసింది. నిరుడు జరిగిన గురుకుల ఉద్యోగాలకు వివిధ పరీక్షలకు ప్రిపేర్ అయింది. కష్టపడి చదివింది. తల్లిదండ్రుల కష్టాలను కండ్లారా చూసి పెరిగిన ఆ యువతి పట్టుదల పెంచుకున్నది. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కోరుకున్నది. ఎట్టకేలకు అహోరాత్రులు కష్టపడి చదివిన ఆ యువతి కష్టం ఫలించింది.

తొలుత గురుకుల పీజీటీ ఉద్యోగానికి ఎంపికైన సరితకు ఉద్యోగ హార్తి తీరలేదు. ఆతర్వాత విడుదలైన ఫలితాల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగం దరిచేరింది. డిగ్రీ లెక్చరర్ ఉద్యోగమూ వరించింది. టీజీటీ ఉద్యోగమూ ఆమె గుమ్మం ముందుకు వచ్చి నిలిచింది. దీంతో సరిత అత్యున్నతమైన డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాన్ని ఎంచుకున్నది. చూశారా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు.. అన్న మహాకవి మాటలను సరిత నిజం చేసింది కదా.

ఆ ఊరిలోనే కాదు.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన సరితకు ఎందరో అభినందనలు కురిపిస్తున్నారు. ఆమె ఘనతను మెచ్చుకుంటున్నారు. నాలుగు ఉద్యోగాలను సాధించి శభాష్ అని మెప్పు పొందిన సరిత ప్రతిభను హర్షిస్తున్నారు.