ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. కీలక వ్యాఖ్యలు

రచ్చబండ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ముందుగా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని విలేకరుల ఎదుట ప్రదర్శించారు. ఆ తర్వాత కూడా అసెంబ్లీ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు.

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ జరిగే ఎన్నికల్లో మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు సీఎం కేసీఆర్ కు కనువిప్పు కలగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను త్యాగం చేస్తున్నానని, ప్రజలు ఆశీర్వదిస్తారని తనకు నమ్మకముందని తెలిపారు.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ చుట్టూ తెలంగాణ ద్రోహులే ఉన్నారని ధ్వజమెత్తారు. ఉద్యమద్రోహులైన గంగుల కమలాకర్, ఎర్రబెల్లి, పువ్వాడలను తన పక్కన పెట్టుకున్నారని అన్నారు.

కేసీఆర్ చేతిలో తెలంగాణ ఆత్మగౌరవం బందీ అయిందని ఆరోపించారు. ఈ ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు గెలుస్తారని, మునుగోడు ఫలితం తర్వాత కేసీఆర్ పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలుగుతుందని ప్రకటించారు.

నియోజకవర్గ సమస్యలపై విన్నవించుకునేందుకు తాను పలుమార్లు వెళ్లినా సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం 1400 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే కేసీఆర్ కుటుంబం రాజభోగాలు అనుభవిస్తోందని విమర్శించారు.

ప్రాజెక్టుల పేరిట వారు లక్షల రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు. అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టకొని పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలపై కక్ష పూరితంగా ప్రభుత్వం వ్యవహారిస్తుందని అన్నారు.

తెలంగాణ భవిష్యత్ కోసమే మునుగోడు ఎన్నిక జరగనుందని అన్నారు. రాచరిక పాలనను తెలంగాణ నుంచి పారదోలాలంటే ప్రజలంతా నడుం కట్టాలని పిలుపునిచ్చారు.

తనపై, తన సోదరుడిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాడిన భాషను అందరూ అసహ్యించుకుంటున్నారని అన్నారు. మేథావులు, విద్యావంతులు రేవంత్ రెడ్డి వైఖరిని ఖండిస్తున్నారని అన్నారు.