సొంత పార్టీ నేతలకు రాహుల్ వార్నింగ్

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వరంగల్ రైతు సంఘర్షణ సభ వేదికగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కొంచెం కూడా వెసులుబాటు లేదంటూ హెచ్చరిక జారీ చేశారు. గతంలో లాగా ఎవరైనా ఓపెన్ అయితే తీవ్ర చర్యలుంటాయని ఘాటుగా చెప్పారు.

రాష్ట్రంలో ఏపార్టీతోనూ పొత్తు పెట్టకోమని ప్రకటించారు. పొత్తుల విషయంపై ఇక నుంచి ఎవరూ మాట్లాడొద్దని రాహుల్ చెప్పారు. ఎవరైనా మాట్లాడితే పార్టీ నుంచి బహిష్కరణే ఉంటుందని హెచ్చరించారు. ఎంతటి వారినైనా బహిష్కరణకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలపై పోరాడని నేతలకు ఈ సారి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వబోదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. నేతల పనితీరును బట్టే టికెట్లిస్తామని ప్రకటించారు. ప్రజల్లో ఉండి సేవ చేసిన వారికే ఇస్తామని వెల్లడించారు. పైరవీలు అసలే ఉండవని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్, బీజేపీతో లాలూచీ పడే నేతలు మాకు అవసరమే లేదని రాహుల్ ఘంటాపథంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ విధానాలను విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటువంటి వారు మాకు అవసరమే లేదని తేల్చి చెప్పారు.