ధర్మ పెబువులు దిగొచ్చిండ్రు

వారం వారం రచ్చబండ ముచ్చట్లు

రామన్న : మల్లన్నా.. ఎట్టున్నవే..
మల్లన్న : ఎవరే నేను ఎరకబట్టలే..
రామన్న : నేనే రామయ్యని.. కడింటి లచ్చయ్య కొడుకునే.
మల్లన్న : ఓ రామన్న నువ్వా బిడ్డ.. రారా కూసో.. పట్నంల ఉండేదిగా ఎప్పుడొస్తివి..
రామన్న : ఆ రొండ్రొజులైందే..
మల్లన్న : ఆ అంత మంచేనా.. పిల్లాజెల్లా.. వచ్చిండ్రా..
రామన్న : ఆ వచ్చిండ్రే.. ఆ యవసాయం బాగున్నాదె..
మల్లన్న : ఆ.. ఏమెవసాయం బిడ్డా.. ఆనకాలం పంట కూలి నాలికంట.. యాసంగి పంట ఒక్కనాటి వంట.. అన్నట్టుంది బిడ్డా.. నీదే బాగుంది.. పట్నంల బతుకు..
రామన్న : పట్నమని పేరేగాని బతుకు గుదిబండేనె.. ఆలుమగలం, కొడుకు రెక్కలాడిస్తె అన్నిబోను మిగిలేది లేకుండె.. నెలతిరగంగ మేస్తరి కాడ అప్పే అయుతుంది. అబ్బో బతుకుడు కష్టమేనె..
మల్లన్న : అట్నా బిడ్డ.. పట్నంల బానే ఉండ్రనుకున్నం.
రామన్న : సర్నే.. ఈ తడవ ముందగాల్నే ఓట్లొత్తయంటుర్రుగానే.. మనకాడ ఎవరు నిలబడుతుండ్రే ఎమ్మెల్యెకి.
మల్లన్న : అదా.. కొత్తసారు కడుపు సల్లగుండ.. ఊళ్లళ్ల దానంజేస్తుండంట. ఎవర్కన్న ఏమన్న ఆపదొచ్చిందంటే ఉర్కొచ్చి సాయమిస్తుండంట. మనూళ్లెగూడ చానా మందికి ఆసరైండంట. ఈ పాలు ఆ కొత్తసారు నిలబడ్తడంటుంర్రు. ఆయన నిలబడ్తె మా ఆడకట్టోళ్లంతా ఓటెద్దామంటుండ్రు. మనూరోళ్లు చానా మంది కూడా ఆయన యేపే ఉంటరంట. డబ్బు యదజల్లుతుండంట బిడ్డ.
రామన్న : మరి ఆయన ఎటేపు నిలబడ్తడే..
మల్లన్న : ఎటేపుంటే ఏంది బిడ్డా.. మనకి పైసలిత్తె జాలు.. పోయిన తడవ కంటే ఈపాలు కొత్తసారు ఎక్కువిత్తడంట. పోయిన ఓట్లల్ల ఐదొందల్లెక్క ఇచ్చిండ్రు. ఈ పాలు ఎయ్యిత్తరంట(సంబురంగా నవ్వుతూ) బిడ్డ. నీకు మూడోట్లకు మూడేలు వత్తయి. మా యింట్ల బానే వత్తయి. మా కొడుకు, కోడలు, ఇద్దరు మనవళ్లతో కలిపి ఐదేలు వత్తయి. నాయి నేనే అడుక్కుంట. ఖర్సులుంటయిగా బిడ్డ ఈ వయసుల.
రామన్న : మరి మాకు పట్నం నుంచి రావల్నంటే చార్జీలైతయే.. ఆ ఖర్సుగూడ ఇయ్యరా..
మల్లన్న : ఆ.. ఎందుకియ్యరు బిడ్డ.. మనూళ్లె ఆ పెద్దాసామి గూడ ఈసారి ఆ కొత్తసారెంటేనట. ఆ పెద్దాసామికి సుట్టరకం ఉందంట. నీకు ఆయినిప్పిత్తడు లే.
రామన్న : ఆ ఇంతకూ ఆ కొత్తసారు మనూళ్లె ఏంజేసిండే.
మల్లన్న : ఓ ఒకటా రెండా బిడ్డ.. గా రాంగాడు సస్తె ఆ పెద్దాసామితో పదేలు ఇప్పిచ్చె. గా మూలింటి సాయిగాని బిడ్డతో బాటు ఇంకో ఐదుగురి పిల్లల పెండ్లిలకి ఆ కొత్తసారు తలా ఇన్నిచ్చిండు. దేవుండ్ల బొమ్మలు యిప్పిచ్చి, అన్నదానాలూ బెట్టిండు.. పుల్లిగాని కాలిరిగితె కొత్తసార్ని పటేలు దీస్కొచ్చిండు. మందలిచ్చి పదేలిచ్చిండు. అబ్బో ఆయన దానపెబువే. అలాంటోళ్లు తక్కువుంటరు.
రామన్న : ముత్తన్నా.. నేనూ ఆ కొత్తసారెంటే ఉంటనే. పట్నంకి రేబ్బోతనే. ఇప్పుడెబొయి పెద్దాసామిని కలుత్త.

(అట్నుంచి అప్పుడే రవి వచ్చిండు)
రవి : పెద్దలు బాగున్నారె.
మల్లన్న : ఎవరీ పిలగాడు. నేనెర్కబట్టలేదు.
రామన్న : పల్లేరు రామచంద్రు కొడుకే. పట్నంల్నే సదువుకుండు. ఏం పిలగా బాగున్నవా.
రవి : బాగానే ఉన్న. ఏదో ముచ్చట్లబడ్డరు.
రామన్న : మల్లన్నని మందలిత్తె ముచ్చటే జెప్పబట్టె.
రవి : ఏం చెప్పిండు.
రామన్న : ఆ ఏముంది. కొత్తసారొచ్చిండంట.. ఆయన గురించే జెప్పిండు. పైసలు యదజల్లుతుండంట. ఈపాలు ఆయనే నిలబడ్తడంటగా. అందరటే ఉండ్రంట.. అదే జెప్తుండు.
రవి : నేను కొన్ని విషయాలు చెప్త వినుర్రి. మనమంతా పేదోళ్లం. మనం ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్లం. మన అవసరాలను ఆసరా చేసుకొని పెద్దోళ్లు మనల్ని దోచుకోవడానికి ముందుగా ఎర జూపుతరు. అంటే దానం జేస్తున్నట్లు నటిస్తరు.

ఇంతకాలం అదే కొత్తసారు ఎందుకు దానం చేయలే. ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చినం. మనకు ఆపదొస్తె చింతాకు మందం సాయం చేసి, చిటారు కొమ్మన కూర్చొని మన నెత్తిన కాలేస్తరు.

మొన్న పుల్లన్న కాలు విరిగితే నేనే పట్నం తీసుకెళ్లి ఆస్పత్రిలో వైద్యం చేయించిన ఎంతయిందో తెలుసా. రూ.1.50 లక్షలైనయి. అరెకరం అమ్మిండు. ఆ కొత్తసారు చుట్టమైన మనూరు ఆపెద్దాసామే ఆ పొలాన్ని ఆరుమూరుకు కొన్నడు.

పోయిన సారి గెలిచినాయన కూడా ఇలాగే చేసిండు. గెలిచి నెత్తినెక్కిండు. దానం చేసిన సొమ్ముకు వెయ్యింతలు మూట గట్టుకుండు. మళ్లీ ఎవరికైనా సాయం చేసిండా. ఇప్పుడు ఎందుకు చేస్తలేదు. మళ్లీ చేస్తానికి వస్తడా.

ఎప్పుడూ దానం చేసే వాళ్లుంటే కొత్తవాళ్లు ఎందుకు పుట్టుకొస్తరు. ఆలోచించండి.. ఎప్పుడూ ఒకరు కొత్త వారు పుట్టుకొస్తరు. మేము దానకర్ణులం. మా అంత దానం చేసే వాళ్లు ఎక్కడా లేరన్నట్టు బిల్డప్ ఇస్తరు. గెలిచి పదవి వచ్చాక ప్రజల దరికే రారు. వచ్చే టైమూ వారికి ఉండదంటే నమ్మండి.

అసలు దానం ఎందుకు చేయాలండి. ప్రభుత్వ పథకాలు సరిగా అమలైతే ఏ పేదోడికి ఏ పెద్దోడూ దానం చేయాల్సిన అవసరమే ఉండదు. విద్య, వైద్యం ఉచితంగా అందితే ఎవరూ దానకర్ణులు కావాల్సిన అవసరమే ఉండదు.

నేనొకటి తెలియక అడుగుతా గతంలో దానం చేసిన వాళ్లు ఎటు వెళ్లారు. ఇప్పడు చేస్తున్న వాళ్లు రేపు వచ్చి దానం చేస్తారని గ్యారంటీ ఉందా. రేపు ఇంకొక దాన కర్ణుడు రాడన్న నమ్మకముందా. అంటే జనం పిచ్చోళ్లు.. నాలుగు రాళ్లు విసిరేస్తే ఐసయిపోతరు. ఓట్లు గుద్దుతరు. మేము రాజ్యమేలుతం. బాగా సంపాదించుకుంటం. తరాలు తిన్నా తరగని సంపద కూడేస్తం.

పేదలు మాత్రం అట్లనే ఉండాలె. దానం తీసుకునేటట్లే ఉండాలె. బాగు పడొద్దు. వాళ్లిండ్లల్ల చదువుకున్నోళ్లకు ఉద్యోగాలొస్తే చెప్పినట్లు వినరు. దానం తీసుకోరు. వృత్తిదారులుగా, కూలీలుగా, కంపెనీలల్ల పనులు చేయాలి. మేము మాత్రం డాబుగా దర్పాన్ని ప్రదర్శిస్తాం. ఏలెటోళ్లుగానే ఉంటం. మాకు రాసిపెట్టి ఉంది.. అని అనుకుంటరు.

ఇంకోటి చెప్తా. ఓట్లప్పుడు వచ్చి రూ.500 అంతగాకుంటే రూ.వెయ్యి ఇస్తరు. అవెన్నాళ్లొస్తయే. ఒక క్వార్టర్ మొకానేస్తరు. ఒక ఆ ఐదొందలు, వెయ్యి కోసం ఐదేండ్లు వాళ్లకు హక్కు ఇచ్చినట్లుంటంది. గా సొమ్ము కోసం కక్కుర్తి పడుడేందె. మారాలి.. మనం మరాల్నే.

మరి ఇప్పుడేమంటరే. దానం చేసే ఆ కొత్తసారు బెటరా. ప్రజల తరఫున పనిచేసే పార్టీ కానీ, అభ్యర్థికానీ.. మన రెక్కల్ల పక్కల్ల తిరిగేటోడు కావాలా.. మీరే ఆలోచించుకోండి. మెరుగులు చూసి మోసపోవద్దు. గుణం చూడాలి.

మల్లన్న, రామన్న : బిడ్డా రవి.. మా కళ్లు తెరిపించినవ్. నిజమే నువు జెప్పింది నూటికి నూరుబాళ్లు నిజం. ఆ కొత్తసారు మాటినం, ఆ పెద్దాసామి కాడికి బోం.. మంచోళ్లు ఎవరైతే వాళ్లకే ఓటేస్తం. పైసల్దీస్కోం ఒట్టు.. ఓట్ల కోసమే వచ్చే దానపెబువుల్ని నమ్మమంటే నమ్మం.

– బొమ్మకంటి బిక్షం,
రచ్చబండ ఎడిటర్,
హైదరాబాద్