సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగం.. అసలేం జరిగింది?

రచ్చబండ, హైదరాబాద్ : సికింద్రాబాద్ లో అగ్నిపథ్ చిచ్చు రాజుకుంది. రైళ్ల దహనానికి దారితీసింది. రైల్వేస్టేషన్ పరిసరాల్లో బీభత్స వాతావారణం నెలకొంది. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృత్యువాత పడ్డారు. మరికొందరికి గాయాలయ్యాయి.

అగ్నిపథ్ ను రద్దు చేయాలని కోరుతూ వివిధ ప్రాంతాలకు చెందిన ఆందోళనకారులు ఉదయమే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు చేరుకొని పట్టాలపై నిరసనకు దిగారు. పోలీసులు వారించే ప్రయత్నంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిస్థితుల్లో నిరసనకారులు రైళ్ల దహనానికి పాల్పడ్డారు.

మూడు రైళ్ల దహనం
నిరసనకారుల ఆందోళనలో మూడు రైళ్ల దహనమయ్యాయి. ఈస్ట్ కోస్ట్, అజంతా, రాజ్ కోట్ రైళ్లు దహనమయ్యాయి. స్టేషన్ పరిధిలోని స్టాళ్లన్నీ ధ్వంసమయ్యాయి.

కాల్పుల్లో ఒకరి మృతి.. పలువురికి గాయాలు
పోలీసుల కాల్పుల ఘటనలో రాకేశ్ అనే వ్యక్తి మృతి చెందగా, తీవ్రగాయాల పాలైన 8మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లాఠీచార్జిలో పలువురికి గాయాలయ్యాయి. ఈ సమయంలో సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి. రైళ్ల సిగ్నళ్లు ధ్వంసమయ్యాయి. పరిసరాల్లోని 40కి పైగా బైకులు దగ్ధమయ్యాయి.

పలు రైళ్ల రద్దు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైళ్ల దహనం కారణంగా ఇక్కడి నుంచి వెళ్లే రైళ్లనన్నింటినీ నిలిపివేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. 44 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు.

పోలీసుల కాల్పుల ఘటనతో నిరసనకారుల ఆందోళన తీవ్రతరమైంది. రైలు పట్టాలపైనే సుమారు 2వేల మందికి పైగా ఉండి ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించేదాకా ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని ఉన్నారు. ఆందోళన విరమించకుంటే మరోసారి కాల్పులు జరుపుతామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రయాణికులు చెల్లాచెదురు
ఈ దశలో స్టేషన్ కు వచ్చిన, సమీపంలోని బస్టాండ్లలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురై చెల్లాచెదురుగా వెళ్లిపోయారు. దీంతో వారంతా తీవ్ర అవస్థలు పడుతున్నారు. క్లాక్ టవర్ సెంటర్ నుంచే వాహనాల దారి మళ్లించారు. స్టేషన్ కు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

కిషన్ రెడ్డికి అమిత్ షా ఫోన్
సికింద్రాబాద్ ఘటనపై కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్రానికి చెందిన మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.