నేటి నుంచి ప్రగతి పండుగ

పల్లె మురవాలి.. పట్నం మెరవాలి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నేటి నుంచి పల్లె, పట్టణ ప్రగతి పండుగ షురూ అవుతుంది. ఆయా కార్యక్రమాల ద్వారా గ్రామాలు, పట్టణాలను బాగా అభివృద్ధి చేయాలని, ఎటు చూసినా పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది. 10 రోజుల పాటు జరిగే  కార్యక్రమం ముగిసిన తర్వాత పల్లె, పట్టణప్రగతిలో భాగంగా నిర్దేశించిన ఏ పనికూడా అపరిష్కృతంగా ఉండటానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టంచేసింది.     ‘రాష్ట్రంలోని ప్రతి గ్రామం పచ్చదనంతో వెల్లివిరియాలి. ప్రతి ఇంట్లో మొక్కలు పెంచాలి.

గ్రామీణ ప్రజలందరూ తమ ఇళ్ల ముందు, ఇంటి ఖాళీస్థలాల్లో మొక్కలు నాటేలా చైతన్యపర్చాలి. ఇందుకోసం అన్ని పల్లెల్లో ప్రతి ఇంటికీ ఆరు మొకల చొప్పున ఇంటింటికీ పంపిణీ చేసి నాటించాలి’ అని ఇటీవల ఉన్నతాధికారులతో  నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్‌

ఆదేశించారు. సన్నాహక సమావేశాలను జిల్లాలు, మండలాల వారీగా నిర్వహించనున్నారు. నూతన రైస్‌మిల్లుల ఏర్పాటుకు చొరవ చూపాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. వ్యవసాయానికి, రైతుకు ప్రభుత్వ యంత్రాంగం అండగా నిలబడాలని ప్రభుత్వం ఆదేశించింది. కల్తీ విత్తనాల అమ్మకాలను నిరోధించాలని సీఎం ఆదేశించారు.

ఇప్పటికే పెండింగ్ బిల్లుల విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఖర్చుల కోసం నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. శ్రమదానంతో కరెంటు సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది. గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలను అధిగమించడానికి పవర్‌ డేను పాటించాలి. ఇదే సమయంలో రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను పరిషరించడానికి సమగ్ర నివేదిక తయారుచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.