ప్రతి రైతు లక్షాధికారి కావాలి

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట: ప్రతి రైతు లక్షాధికారి కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. నీటిని సద్వినియొగం చేసుకోవడం ద్వారా ఆర్థిక పరిపుష్టి కలుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్, ఎం.కొత్తగూడెం, మిడతనపల్లి తదితర గ్రామాల్లో నూతనంగా నిర్మించిన చెక్ డ్యామ్ లను ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం ఆయన చెక్ డ్యామ్ ల నిర్మాణాల చోట తనను కలసిన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ యావత్ రైతాంగం మూస పద్దతిలో చేస్తున్న వ్యవసాయానికి స్వస్తి చెప్పి అధిక దిగుబడి పంటల వైపు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

దశాబ్దాలుగా వృథాగా పోతున్న పాలేరు జలాలను వినియోగంలోకి తెచ్చేందుకు అవసరమైన చెక్ డ్యామ్ ల నిర్మాణాలకు అడిగిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.120 కోట్లు మంజూరు చేశారన్నారు. 700 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణంలో వ్యవసాయాన్ని సాగు చేసుకునేందుకు వీలుగా జిల్లాలో మొత్తం 16 చెక్ డ్యామ్ ల నిర్మాణాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. కేవలం మూడు నెలల వ్యవధిలో పాలేరు వాగు పై ఆరు చెక్ డ్యామ్ లను పూర్తి చేసి నీటి వృథాకు పరిష్కారం కనుగొన్నామన్నారు. మరొకటి 95 శాతం పూర్తయిందని, మిగతావి నిర్మాణాలు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.

చెక్ డ్యామ్ లతో జలకళ ఉట్టిపడేలా ఉందన్నారు. ఇక్కడికి చేరిన రైతుల్లో వెల్లివిరుస్తున్న ఆనందానికి అవధులు లేవని ఆయన అన్నారు. జీవితకాలం ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామంటూ చెక్ డ్యామ్ పరిధిలోని రైతాంగం తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఇకపై ఈ ప్రాంత రైతాంగం బోర్ల వినియోగం తగ్గించాలని ఆయన సూచించారు.

అయితే వనరులను వృథా కానివ్వరాదని రైతాంగానికి మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చెక్ డ్యామ్ ల నిర్మాణాల ద్వారా మొత్తం 18 కిలో మీటర్ల మేర జలకళ సంతరించుకుందని, తాజాగా కురిసిన వర్షాలతోనే నీటి ప్రవాహం మొదలైందన్నారు. దశాబ్దాలుగా దిగువకు పాలేరు జలాలు వృథాగా పోతున్నా అప్పటి పాలకులు ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన దుయ్యబట్టారు. వృథా నీటికి అడ్డుకట్ట వేసి ఈ ప్రాంత రైతాంగానికి నిరందించి భూములను సస్యశ్యామలం చేయాలన్న ఆలోచనే ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చేయలేదని విమర్శించారు. అటువంటి సమయంలో ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో ఇంచు భూమిని కూడా వదలకుండా సాగులోకి తేవాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం ఇప్పటికి నెరవేరినట్లయిందన్నారు.

తెలంగాణా ప్రాంత రైతాంగం గోస తెలిసిన నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. రైతులను సుసంపన్నం చెయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం మన్నారు. ఆ లక్ష్యసిద్ధి సాధనలో రైతాంగం భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, ఎంపీపీ మర్ల స్వర్ణలతా చంద్రారెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, సర్పంచ్ లు సాలేబొయిన రజిత, కాసాని అరుణా హనుమంత్ గౌడ్, ఎంపీటీసీ ధనమ్మ, సింగిల్ విండో చైర్మన్ సత్యనారాయణరెడ్డి, బొల్లే జానయ్య తదితరులు పాల్గొన్నారు.