- ‘మా’ అసోసియేషన్ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషయన్ మా కార్య నిర్వాహక కమిటీ ఎన్నికలు ఈసారి మంటలు లేపుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ రంగు పులుముకుంది. గత ఎన్నికల్లో ఎవరు ఎవరికి మద్దతుగా నిలిచారో తెలియలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా ఎవరు ఏ వర్గమో తేటతెల్లమయ్యేలా ఉంది. పెద్ద స్టార్లు సైతం ఎటో ఒకవైపు నిలబడే పరిస్థితి ఏర్పడనుంది. దీంతో మలుపులెలా తిరుగుతాయే చూద్దాం రండి..
అసలు ఎన్నికల ప్రకటన రాకముందే రాజకీయ వేడి రగిలింది. ఇప్పటి వరకు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ నటుడు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, సీనియర్ నటి, ప్రస్తుత కమిటీలో కార్యదర్శిగా పనిచేసిన జీవితా రాజశేఖర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ప్రస్తుత కమిటీలో కార్యనిర్వాహక సభ్యురాలు హేమ పోటీలో నిలవనున్నట్లు వెల్లడైంది. దీంతో చతుర్ముఖ పోటీ నెలకొంది.
వీరిలో ఎవరూ రంగంలోకి రాకముందు ప్రకాష్ రాజ్ తాను మా కమిటీ అధ్యక్ష పోటీలో ఉంటానని ప్రకటించారు. పోటీలో ఉండే ఇతర కార్యవర్గ సభ్యులను కూడా ఆయన ప్రకటించారు. అయితే మొదట ప్రకాష్ రాజ్ కు మెగా బ్రదర్ నాగబాబు మద్దతు ప్రకటించడంతో ఒకింత ఆసక్తి నెలకొంది. అయితే అనంతరం మంచు విష్ణు పోటీకి సిద్ధమవడంతో మెగా బ్రదర్స్ సపోర్ట్ ప్రశ్నార్థకమైంది. చిరంజీవితో ప్రకాష్ రాజ్ కు సన్నిహిత సబంధాలు ఉన్నా.. మోహన్ బాబు చిరకాల స్నేహితుడు కావడంతో ఆయన మద్దతుపై మరింత ఉత్కంఠ నెలకొంది.
మరో విషయమేమిటంటే గతంలో మెగా బ్రదర్స్ మద్దతుతో గెలిచిన వారున్నారు. మరి ఈసారి ప్రకాష్ రాజ్ కు మెగా మద్దతు ఉంటుందా.. ఉండదా.. ప్రకాష్ రాజ్ పట్ల పరభాషా నటుడు అన్న ముద్ర పనిచేస్తుందా.. లేదా.. అన్నది వేచి చూడాలి.
పోటీ చేస్తానని ప్రకటించిన వెన్వెంటనే తన తండ్రి మోహన్ బాబును వెంటబెట్టుకొని క్రుష్ణ, క్రుష్ణంరాజును స్వయంగా కలిసి మద్దతు ఇవ్వాలని మంచు విష్ణు కోరారు. ఇతర పెద్ద స్టార్ల మద్దతు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అందుబాటులో లేని వారికి ఫోన్ లో కోరుతున్నాడట. సీనియర్ నటుడైన మోహన్ బాబుకు ఉన్న పరిచయాలు, పెద్ద స్టార్లతో తనకున్న ఫ్రెండ్ షిప్ తో గెలిచి తీరుతానంటున్నాడు విష్ణు.
ప్రస్తుత కమిటీలో కార్యదర్శిగా క్రియాశీలకంగా పనిచేసిన అనుభవం, నటిగా తనకున్న పరిచయాలు, తన భర్త రాజశేఖర్ పరిచయాలు తనను గెలిపిస్తాయని జీవిత ధీమాతో ఉన్నారు.
హేమ గతంలో వైస్ ప్రెసిడెంట్ గా, జనరల్ సెక్రటరీ గా పనిచేసిన అనుభవంతో ముందుకొచ్చానంటోంది. ఏదేమైనా ప్రస్తుతం నలుగురు ముందుకొచ్చినా, మున్ముందు తగ్గుతారా, లేదా పోటీదారులు పెరుగుతారా అన్నది చూద్దాం మరి.