ప్రజలారా వర్షాలొస్తున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి

• శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి

రచ్చబండ, శంకర్ పల్లి: ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ సూచించారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల ఇంకా నాలుగు రోజులపాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు ఇనుప విద్యుత్ స్తంభాలు, వాటి పరిసరాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలన్నారు. అలాగే శిథిలావస్థలో ఉన్న ఇండ్లను వెంటనే ఖాళీ చేయాలని సూచించారు.

వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సాధ్యమైనంత వరకు వేడి చేసిన నీటిని తాగాలన్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో విష సర్పాలతో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.