బర్త్ డే పార్టీకి తప్పతాగి ఆలస్యంగా వచ్చాడు.. వెళ్లిపొమ్మన్నందుకు నలుగురిపై కత్తితో దాడి

ఓ బర్త్ డే పార్టీ ముగిశాక తప్పతాగి వెళ్లిన ఓ వ్యక్తికి ఆ ఇంటివారు భోజనం నిరాకరించారు. దీంతో ఆ ఇంటికి చెందిన నలుగురిపై కత్తితో ఆ వ్యక్తి దాడికి ఒడిగట్టాడు. ఆ నలుగురు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇది ఢిల్లీ నగరంలో ఇటీవలే చోటుచేసుకుంది.

ఢిల్లీ ద్వారకాలోని కక్రోలా ప్రాంతంలోని భారత్ విహార్ లో కుటుంబ సభ్యులు ఐదేళ్ల బాలుడి బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకు ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించారు. పార్టీ ముగిసిన తర్వాత అర్ధరాత్రి 12.30 తర్వాత వారి పొరుగింటి విక్కీ (28) వచ్చాడు. అతడు పూటుగా మద్యం తాగి వచ్చాడని గుర్తించారు. దీంతో వెళ్లిపోవాలని కోరారు. భోజనం పెట్టడానికి వారు నిరాకరించారు.

ఈ సమయంలో బయటకెళ్లిన అతను ఓ కత్తితో వచ్చాడు. ఆ ఇంటివారిని దూషిస్తూ ఇంట్లోకి దూసుకొచ్చాడు. తన వద్ద ఉన్న కత్తి తీసి 40 ఏళ్ల వయసున్న తల్లి మాల్తీదేవి ఆమె కూతుళ్లు నీలం, స్వప్న, పుష్పను విచక్షణారహితంగా పొడిచాడు.

ఈ సమయంలో బాధితుల కేకలు విన్న ఇరుగు పొరుగు వారు వచ్చి నిందితుడు విక్కీని పట్టుకొని కొట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు.

ఆ తర్వాత బాధితులందరినీ దీన్ దయాళ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ముగ్గురు డిశ్చార్జి కాగా, నీలం ఇప్పటికీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు.