పోలీసుల కళ్లుగప్పి ఆవులను చెక్ పోస్టులు దాటిస్తున్నారు!

• గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి
• డంపు చేసిన ఆవులను గోశాలలకు తరలించాలి
• విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ
• అదనపు డీజీపీకి వినతిపత్రం అందజేత

రచ్చబండ, హైదరాబాద్ : గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి.. రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా గోవులను వధించేందుకు తరలిస్తున్నారు.. వెంటనే వాటిని ఆపాలి.. అని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. పోలీసుల కళ్లుగప్పి అనేక అక్రమ మార్గాల్లో ఆవులను చెక్ పోస్టులు దాటిస్తున్నారని పేర్కొంది.

శుక్రవారం తెలంగాణ డీజీపీ కార్యాలయంలో అడిషనల్ డీజీపీ జితేందర్ ను కలిసిన రాష్ట్ర నాయకులు వినతి పత్రం సమర్పించారు. బక్రీద్ దగ్గర పడుతున్న కొద్దీ ఆవులు విపరీతంగా తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గోవులను ఇన్నోవా వాహనాల్లో తరలిస్తున్న నిన్న మొన్నటి దుర్మార్గపు చర్యలు చూస్తే మనసు చలించిపోతుందని ఆందోళన చెందారు. ఎవరికీ అనుమానం రాకుండా లగ్జరీ వాహనాల్లో ఇలాంటి మూగజీవులను రవాణా చేయడం దుర్మార్గపు చర్య అని అభివర్ణించారు. హైదరాబాద్ తో పాటు నల్లగొండ, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్ వంటి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వధించేందుకు విరివిగా గోవులను డంపు చేసి ఉంచారని చెప్పారు.

సీసీ కెమెరాల ఆధారంగా గోవులు ఎక్కడెక్కడ తరలిపోతున్నాయో పరిశీలించి.. వాటిని పట్టుకొని వచ్చి గోశాలలకు తరలించాలని కోరారు. ఆవులను అక్రమంగా తరలించే వారిపై కఠినమైన కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు అదనపు డీజీపీని కోరారు.

భాగ్యనగరంలోని ఓల్డ్ సిటీ తో పాటు సైదాబాద్, బోరబండ, ఎర్రగడ్డ, తదితర ప్రాంతాల్లో గోవులను విపరీతంగా డంప్ చేశారని చెప్పారు. పిల్లికి, కుక్కకు, కోడికి ప్రమాదాలు జరిగితే పెద్ద ఎత్తున స్పందించే జంతు ప్రేమికులు.. గోవు విషయంలో మౌనం పాటించడం సరికాదన్నారు. గోహత్య చట్టాలను కఠినంగా అమలు చేసి, గోవుల ప్రాణాలను కాపాడాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, రెండు తెలుగు రాష్ట్రాల సేవా ప్రముఖ్ బండారి రమేష్, తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి యాదిరెడ్డి, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర బజరంగ్దళ్ కన్వీనర్ శివరాములు, భాగ్యనగర్ ప్రచార ప్రముఖ్ వంశీ పాల్గొన్నారు.