మిర్యాలగూడ సమగ్రాభివృద్ధే నా ధ్యేయం

• రాజకీయాలకు అతీతంగా భాగస్వాములు కావాలి
• ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు
• రూ. 9కోట్ల 6 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం

రచ్చబండ, మిర్యాలగూడ : నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయమని నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు పునరుద్ఘాటించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.9కోట్ల 6 లక్షల ఆర్ అండ్ బీ నిధులతో సీసీ రోడ్లు, ఇతర నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ఆదివారం శంకుస్థాపన చేశారు. నందిపాడు బై పాస్ రోడ్డు నుంచి ఐలాపురం వరకు, అద్దంకి హైవే నుంచి గోగువారిగూడెం వయా అన్నపురెడ్డి గూడెం వరకు మొత్తం 13 కిలోమీటర్ల దూరం బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.5కోట్ల 10లక్షల ఆర్ అండ్ బీ నిధులు, అద్దంకి హైవే రోడ్డు (రవీంద్ర నగర్) నుంచి చిల్లాపురం రైల్వే ట్రాక్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి మొత్తం 2.2 కిలో మీటర్ల దూరానికి రూ.3కోట్ల 96 లక్షల ఆర్ అండ్ బీ నిధులు లభించినట్టు తెలిపారు.

మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. అదే విధంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో రూ.18కోట్ల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపడుతున్నట్టు వివరించారు.

అంతేగాకుండా 15వ ఆర్థిక సంఘం నుంచి మంజూరైన రూ.2కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో 7వేల ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చేందుకు నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో అస్మదీయులు.. తస్మదీయులనే భేదాలు తమకు లేవని తెలిపారు.

పట్టణ ప్రగతిలో భాగంగా అన్ని వార్డుల్లో సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ అధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. కరోనా కష్టకాలంలోనూ ప్రతినెలా గ్రామాల అభివృద్ధి కోసం రూ.339 కోట్లు, మున్సిపాలిటీలకు రూ.148 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు.

పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో నాలాల పరిశుభ్రత, పొదలు, పిచ్చి మొక్కల తొలగింపు, విద్యుత్ దీపాల పర్యవేక్షణ, వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయుట, పార్కు పరిశుభ్రత, అక్రమ నిర్మాణాల తొలగింపు తదితర పనులను మున్సిపల్ అధికారులు నిరంతర ప్రక్రియగా భావించి నిర్వహించాలని సూచించారు.

వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇంఛార్జీలు తమ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను, అపరిష్కృతంగా ఉన్న సమస్యలను గుర్తించి వెంటనే బాధ్యతాయుతంగా పరిష్కరించాలని అన్నారు. గతంలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో భాగంగా పెండింగ్ లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నదని అన్నారు.

జిల్లా మంత్రికి రూ.2కోట్లు, కలెక్టర్ కు కోటి రూపాయలు, జిల్లా మంత్రి అంగీకారం మేరకు సీడీఎఫ్ (నియోజకవర్గ అభివృద్ధి నిధి) నుంచి ఖర్చు చేసేందుకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం అధికారాలు మంజూరు చేసిందన్నారు. ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వం నుంచి నిధుల మంజూరు కోసం వేచి చూడకుండా పట్టణ ప్రగతిలో భాగంగా అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేసేందుకు సీడీఎఫ్ నిధులు ఉపకరిస్తాయని అన్నారు.

మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు. రెండేండ్లలో రూ.766కోట్ల 12లక్షల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టామని అన్నారు. డీఎంఎఫ్టీ ద్వారా మున్సిపాలిటీల్లో చెత్త, చెదారం సేకరణ కోసం కోటీ 67 లక్షల రూపాయలతో ట్రాక్టర్లు, ఆటోలు, జేసీబీ కొనుగోలు చేసి పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు.

పట్టణంలో పే అండ్ యూజ్ విధానం ద్వారా రూ.72 లక్షల వ్యయంతో ఆరు పబ్లిక్ టాయిలెట్లను నిర్మించామని చెప్పారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను మంజూరు చేయించానని అన్నారు.

అహ్లాదాన్ని పంచే మినీ ట్యాన్క్ బండ్ నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు సరిపడకపోతే అదనంగా రూ.6కోట్లు కేటాయించినట్టు తెలిపారు. స్థానిక సుందరయ్య పార్కులో సుందరీకరణ పనులు చేపట్టామని చెప్పారు. మిర్యాలగూడ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీల జాబితాలో చేర్చేందుకు ప్రజల సహకారం అవసరమని భాస్కర్ రావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ నరేందర్ రెడ్డి, డీఈ గణేష్, నాయకులు అన్నభీమోజు నాగార్జున చారి, నూకల హన్మంత్ రెడ్డి, కౌన్సిలర్లు ఇందిరమ్మ-గోవింద్ రెడ్డి, షేక్ జావిద్, ఉదయ భాస్కర్, మలగం రేమేష్, వంగాల నిరంజన్ రెడ్డి, గొంగిడి సైదిరెడ్డి, పత్తిపాటి నవాబ్, పునాటి లక్ష్మీనారాయణ, బాసాని గిరి, రామచంద్రు నాయక్, రేణు బాబు, యర్రమల్ల దినేష్, పాలరపు సత్యనారాయణ, వంశీ, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.