వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే విజయం

• మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జోస్యం
• అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ

రచ్చబండ, శంకర్ పల్లి : రాష్ట్రంలో జరగనున్న వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుందని బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. తన కొడుకు పెళ్లి పత్రికలను శంకర్ పల్లి మండలంలోని జనవాడ, గాజులగూడ గ్రామాల్లో ఆదివారం బంధుమిత్రులు, బీజేపీ కార్యకర్తలకు, అభిమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నో అభివృద్ధి పథకాలకు నిధులను అందిస్తున్నదని తెలిపారు. పేదల సంక్షేమానికి కేంద్రం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నదని అన్నారు. ఆ మేరకు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ విజయకేతనం ఎగురవేస్తుందని అన్నారు.

అభాగ్యులకు కొండా ఆసరా
బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వితరణ చాటుకున్నారు. అభాగ్యులకు అక్కున చేర్చుకొని వారు చలి నుంచి రక్షణ పొందేందుకు దుప్పట్లు పంపిణీ చేసి మానవత్వం చాటుకున్నారు. శంకర్ పల్లి మండలంలో పర్యటిస్తున్న సమయంలో ఆయనకు రోడ్లపై కనిపించిన పలువురు అభాగ్యులకు దుప్పట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శంకర్ పల్లి మండల అధ్యక్షుడు బసగాళ్ల రాములుగౌడ్, చేవెళ్ల అసెంబ్లీ నియోజక వర్గం కన్వీనర్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.