ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

రచ్చబండ : నల్లగొండ ఎంపీ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు కెప్టెన్‌ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ పట్టణంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఇటీవల దాడికి గురైన జర్నలిస్టు యలక సైదులుగౌడ్‌, సింగ మోహనరావు నివాసాలను ఉత్తమ్‌ సందర్శించి, వారిని పరామర్శించారు.

టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, జిల్లా యంత్రాంగం అవినీతిని బయటపెట్టిన వారిపై దాడికి పాల్పడటంపై తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఉత్తమ్ చెప్పారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసు అధికారులను హెచ్చరించారు. అధికార యంత్రాంగం అంతా అధికార పార్టీ నేతల ఇష్టానుసారంగా పని చేస్తున్నట్లు ఆరోపించారు.

రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు నిర్వహించాలి
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను రాష్ట్రపతి పాలనలో నిర్వహించాలని ఎంపీ ఉత్తమ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తాను ఈ విషయాన్ని పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. త్వరలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటవుతుందని జోస్యం చెప్పారు.