చేతులెత్తి మొక్కుతున్నా.. తప్పుడు ప్రచారం చేయకండి : వేడుకున్న సినీ నటి మీనా

రచ్చబండ : ప్రముఖ సినీ నటి మీనా కుటుంబం తీవ్ర విషాదంలో మునిగి పోయి ఉంది. ఆమె భర్త విద్యాసాగర్ అకాల మరణం ఆమెను ఎంతగానో కుంగదీసింది. సినీలోకంతో పాటు అభిమానుల్లో కూడా ఆవేదన నిండుకొని ఉంది.

ఈ తరుణంలో ఆమె భర్త మరణంపై ఎవరికి తోచిన రీతిలో వారు వార్తలు ప్రసారం చేస్తున్నారు. విద్యాసాగర్ అనారోగ్యంపై వివిధ భాష్యాలు చెప్తున్నారు. దీనిని తట్టుకోలేక మీనా తీవ్ర ఆవేదనతో ఓ ప్రకటన విడుదల చేశారు. దాని పూర్తి సారాంశం కింది విధంగా ఉంది.

‘‘నేను నా ప్రియమైన భర్త విద్యాసాగర్ ను కోల్పోయి చాలా బాధల్లో ఉన్నాను. మీడియా గోప్యతను గౌరవిస్తుందని, విషాద సమయంలో సానుభూతి చూపుతుందని నమ్ముతున్నా. దయచేసి నా భర్త మరణం విషయంలో ఏదైనా తప్పుడు సమాచారంతో వార్తలు ప్రసారం చేయడాన్ని ఆపండి.

ఈ కష్ట సమయంలో మా కుటుంబానికి అండగా నిలిచిన మంచి మనుషులందరికీ నా కృతజ్ఞతలు. నా భర్తను కాపాడేందుకు శాయశక్తులా కృషి చేసిన వైద్య బృందానికి, ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి, ఐఏఎస్ రాధాకృష్ణన్ కు ధన్యవాదాలు.

సహోద్యోగులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, మీడియా, ప్రేమ, ప్రార్థనలు పంపిన నా ప్రేమ గల అభిమానులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా.. – మీనాసాగర్..’’ అంటూ ప్రకటన విడుదల చేశారు.