రచ్చబండ, సూర్యాపేట : సూర్యాపేట ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి ఔదార్యం చాటారు. అనాథలైన వృద్ధ దంపతలకు నేనున్నానంటూ అక్కున చేర్చుకున్నారు. వారికి కావాల్సిన వైద్య సాయం అందించేందుకు ముందుకొచ్చారు. దీంతో మంత్రి జగదీశ్ రెడ్డి ఔదార్యానికి మెచ్చిన పట్టణ జనం జేజేలు పలుకుతున్నారు.
సూర్యాపేటలోని 28వ వార్డుకు చెందిన చౌగాని లక్ష్మమ్మ, భర్త ఇద్దరే ఉంటున్నారు. నా అనేవారు లేరు. సాయం చేసే దిక్కూ లేదు. లక్ష్మమ్మ భర్త చాలాకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆయనకు చాకిరీ చేయడంతోనే కాలం వెళ్లదీసింది. ఆమెకు వయసు పైబడింది. ఈ దశలో తన శక్యం కావడం లేదని నిర్ణయించుకుంది.
తన మనసుల ఏమనుకుందో ఏమో బుధవారం మంత్రి జగదీశ్ రెడ్డి ఇంటి వద్దకు చేరింది. జనం రద్దీ ఉండటంతో ఓ పక్కన నిల్చుంది. ఇంతలో మంత్రి బయటకు వెళ్తూ ఆ అవ్వను చూసి చలించిపోయాడు. కదులుతున్న కాన్వాయ్ ను ఆపి దిగొచ్చి అవ్వను పలుకరించారు.
ఏమి కావాలమ్మా.. అన్న మంత్రి పిలుపుతో ఆ అవ్వ గుక్కపెట్టి ఏడ్వసాగింది. ఉబికివస్తున్న కన్నీళ్లను తుడ్చుకుంటూ తన బాధలు చెప్పుకుంది ఆ నిస్సహాయురాలు లక్ష్మమ్మ.
పక్షవాతానికి గురైన తన భర్తకు సపర్యలు చేయడం తన వల్ల కావడం లేదు.. తనకు కూడా ఆరోగ్యం బాగా లేదు.. తమకంటూ ఎవరూ లేరని తనను ఏదయినా అనాథాశ్రమంలో చేర్పించాలంటూ తన గోడును వెళ్లబోసుకుంది.
ఆమె మాటలు విన్న మంత్రికి నోట మాట రాలేదు. పుట్టెడు కష్టంలో ఉన్న ఆ అవ్వకు ఏదయినా చేయాలనుకున్నాడు. నేనే మీ ఇంటికి వస్తా.. నేనున్నా.. మీరు బాధపడకండి.. అంటూ వెన్నుతట్టి ఆ అవ్వను పంపించాడు.
అవ్వకు ఇచ్చిన మాట ప్రకారం.. గురువారం నేరుగా లక్ష్మమ్మ ఇంటికి మంత్రి జగదీశ్ రెడ్డి వెళ్లారు. వృద్ధ దంపతుల స్థితిగతులను, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పక్షవాతానికి గురైన లక్ష్మమ్మ భర్తకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని వివరించారు.
వారిని చికిత్సకు తీసుకెళ్లే బాధ్యతను స్థానిక కౌన్సిలర్ కు అప్పజెప్పారు. ఆలనా, పాలనా బాధ్యత తనదే అని మంత్రి ఆ వృద్ధ దంపతులకు భరోసా ఇచ్చారు. మంత్రి వృద్ధుల ఇంటికి రావడం చూసిన స్థానికులు, సూర్యాపేట పట్టణవాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు.