బతికున్న మహిళ పేరిట రైతు బీమా సొమ్ము స్వాహా

రచ్చబండ : ఇదో రకం దోపిడీ. బతికున్న వారి పేరిట రైతుబీమా సొమ్ము కాజేస్తున్నారనేందుకు ఇదే నిదర్శనం. వలస పోయిన ఓ మహిళ చనిపోయిందని ఆమె పేరిట ఓ ముఠా మరణ ధృవీకరణ పత్రం సృష్టించింది. ప్రభుత్వం నుంచి ఏకంగా రైతుబీమా సొమ్ము మంజూరైంది. ఇక పంపకాల్లో తేడా రావడంతో కటకటాలు లెక్కబెట్టాల్సి వచ్చింది.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎస్పీ రంజన్ రతన్ కుమార్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇదే జిల్లాలోని గట్టు మండల కేంద్రానికి చందిన మల్లమ్మ బతుకు దెరువు కోసం కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ కు వలస వెళ్లింది.

మల్లమ్మ వెళ్లేముందు రైతుబంధు డబ్బుల కోసం తన వ్యవసాయ భూమి పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకాన్ని వరుసకు కొడుకైన నాగరాజుకు ఇచ్చి వెళ్లింది. వాటిని చూసిన నాగరాజులో అతని అసలు రూపం బయటపడింది.

అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు ఆలమంచి రాజు, అలియాస్ రాజప్పతో నాగరాజు చేతులు కలిపాడు. ఇద్దరూ కలిసి మల్లమ్మ పేరిట రైతుబీమా సొమ్ము కాజేసేందుకు కుట్ర పన్నారు.

ఇదే సమయంలో ఆ ఊరిలో ఓ మహిళ చనిపోయింది. ఆమె బదులు బతికి ఉన్న మల్లమ్మ పేరున మరణ నివేదిక ఇవ్వాలని అంగన్ వాడీ టీచర్ కు మాయమాటలు చెప్పి నమ్మించారు. ఆమె ఇచ్చిన నివేదికను పంచాయతీ కార్యదర్శికి అందజేశారు.

ఇక్కడ పంచాయతీ కార్యదర్శి పరిశీలనకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే వార్డు సభ్యుడినైన తన మాటే వినరా.. అంటూ కార్యదర్శికి చెప్పి ఒప్పించారు. దీంతో నమ్మిన కార్యదర్శి 2021 డిసెంబర్ 23న మల్లమ్మ పేరిట మరణ ధృవీకరణ పత్రం జారీ చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 15న రైతు బీమా కింద రూ.5 లక్షల నగదు ఎస్పీఐ ఖాతాలో జమయింది. అదే నెల 18న బ్యాంకు నుంచి రూ.3 లక్షల నగదు డ్రా చేశారు. దానిలో రూ.ఒక లక్ష నాగరాజు తీసుకొని, రూ.2 లక్షలను రాజప్పకు ఇచ్చాడు. ఆ తర్వాత బ్యాంకులో ఉన్న మరో రూ.2 లక్షలను నాగరాజు తీసుకోవడంతో అసలు విషయం బయటకు పొక్కింది.

ఈ మేరకు రాజప్ప వ్యవసాయాధికారులను కలిసి ఏకంగా ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన అధికారులు నిర్ధారణ చేసుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు నాగరాజు, రాజప్పలను గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5 లక్షల రైతు బీమా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చగా, కోర్టు రిమాండ్ విధించింది. చూశారా.. గుండెలు తీసిన బంట్లు అంటే.. ఇలాంటోళ్లే అన్నమాట. బతికున్న వారి పేరిటే బీమా సొమ్ము కాజేసిన వైనం కలకలం రేపుతోంది.