మునుగోడు ఉప ఎన్నికపై మంత్రి జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రచ్చబండ : విద్యుత్ శాఖ మంత్రి, నల్లగొండ జిల్లా మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి మునుగోడు ఎన్నిక విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై పార్టీ అధిష్టానికి పలువురు నేతలు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో మంత్రి నియోజకవర్గ ముఖ్య నేతలతో బుధవారం సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరు కాలేదు. ఆయనను ఆహ్వానించలేదని మంత్రి స్వయంగా ప్రకటించడం గమనార్హం. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఉప ఎన్నిక రణరంగానికి ఊపునిచ్చింది.

వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉండగా మునుగోడుకు ఉప ఎన్నిక రావడమేంటి అని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ఎన్నిక తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే వచ్చాయని ఆరోపించారు.

మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమేనని మంత్రి ప్రకటించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు.

మునుగోడు నియోజకవర్గానికి నిధులను వినియోగించుకోవడంలో ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విఫలమయ్యారని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వం నుంచి నిధులను కూడా ఉపయోగించుకోలేకపోయాడు. మంత్రులను, ముఖ్యమంత్రిని కలిసి ఏనాడూ సమస్యల గురించి వివరించలేదని అన్నారు.

మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా పనిచేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతో అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని అన్నారు. కూసుకుంట్లను ఈ సమావేశానికి ఆహ్వానించలేదని మంత్రి ప్రకటించారు.

ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీకి సానుకూలత ఉందని మంత్రి తెలిపారు. టీఆర్ఎస్ ను గెలిపించుకుంటేనే అభివృద్ధి అని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ అవాస్తవమని పేర్కొన్నారు. పార్టీలో అసంతృప్తులు ఎవరూ లేరని మంత్రి తెలిపారు.