కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసి చంపేశాడు!

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : భార్యలపై భర్తల వేధింపులే కాదు.. హత్యాయత్నాలు, హత్యలు నిత్యం ఏదో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. భర్త షాడిజం భరించలేని భార్య దూరంగా ఉంటున్నా వెతికి మరీ కసి తీరేలా కర్కశత్వానికి ఒడిగడుతున్నారు. ఇదీ అలాంటి కోవకు చెందినదే. కర్ణాటకలో తాజాగా చోటుచేసుకుంది.

కర్ణాటక రాష్ట్రంలోని హోళెన రసీపురలోని కోర్టు ప్రాంగణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకొంది. పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. శివకుమార్, చైత్రకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం వారి జీవనం సాఫీగానే సాగింది.

కొంతకాలానికి ఇద్దరి నడుమ వివాదాలు ముసిరాయి. గొడవలు ముదిరడంతో భార్యాభర్తలు ఇద్దరూ వేరుగా ఉంటున్నారు. ఈలోగా విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దశలోనే విడాకుల అనంతరం తనకు భర్త నుంచి భరణం ఇప్పించాలని చైత్ర కోర్టులో మరో కేసు వేసింది.

కేసు విచారణ కోసం హోళెన రసీపుర కోర్టుకు చైత్ర వచ్చింది. అప్పటికే అక్కడికి చేరుకొని ఉన్న శివకుమార్ ఆమెకు ఎదురుగా వెళ్లి కత్తితో దారుణంగా గొంతుకోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే తనువు చాలించింది. వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.