తల్లీకొడుకులు ఇద్దరూ ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు!

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్లు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగులయ్యారు అని మనం అక్కడక్కడా వింటూ ఉంటాం. కానీ ఇక్కడ తల్లీకొడుకులు ఇద్దరూ ఉద్యోగులైన అరుదైన విషయం చోటు చేసుకొంది. కొడుకుకు ఎలాగైనా ఉద్యోగం రావాలన్న తల్లి కోరిక తీరడంతో పాటు ఆమెను కూడా ఉద్యోగం వరించడం విశేషం.

కేరళ రాష్ట్రంలోని మలప్పురంనకు చెందిన 42 ఏళ్ల బింధు అంగన్ వాడీ టీచర్. ప్రభుత్వ ఉద్యోగం కోసం నోటిఫికేషన్ వచ్చింది. డిగ్రీ అర్హత ఉన్న తన కొడుకును ప్రభుత్వ ఉద్యోగస్తుడిగా చూడాలని ఆ తల్లి కలలు కన్నది. ఆ మేరకు కొడుకును ప్రోత్సహించింది.

ఉద్యోగం నోటిఫికేషన్ ద్వారా కొడుకును దరఖాస్తు చేయించింది. పనిలో పనిగా తనకూ అర్హత ఉండటంతో ఆమె కూడా దరఖాస్తు చేసింది. కొడుకును పట్టుదలగా చదివించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ మేరకు చదివిస్తూ వచ్చింది.

ఇద్దరూ కలిసి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశారు. మూడుసార్లు రాసినా ఫలితం దక్కలేదు. నాలుగోసారి పరీక్షల్లో ఇద్దరికీ ఉద్యోగం వరించింది.

నాలుగో ప్రయత్నంలోనూ కొడుకుతో పాటు బింధు కూడా చదువుతూ రాసాగాంది. తన కొడుకును చదివిస్తూ, తానూ గట్టిగానే ప్రిపేరయ్యింది. పరీక్ష సమయం రానే వచ్చింది. ఇద్దరూ పరీక్ష రాశారు.

కొడుకు ఫలితం కోసం ఎదురు చూడసాగింది. ఫలితాలు రానే వచ్చాయి. తన కొడుకు కోసం సంబుర పడాల్సిన తల్లి.. ఏకంగా ఎగిరి గంతేసినంత పనైంది. ఆ ఫలితాల్లో ఇద్దరికీ ఉద్యోగాలొచ్చాయి. ఆ ఇంట్లో డబుల్ సంబురాలొచ్చాయి.

లోయర్ డివిజనల్ క్లర్క్ గ్రేడ్ పరీక్షలో బింధు కొడుకుకు 38వ ర్యాంకు వచ్చి ఉద్యోగానికి ఎంపికయ్యాడు. లాస్ట్ గ్రేడ్ సర్వెంట్ పరీక్షల్లో బింధు 92వ ర్యాంకు సాధించి ఉద్యోగానికి ఎంపికైంది. దీంతో ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగం వరించింది. ఈ సందర్భంగా ఆ ఇంట్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.