భార్య అలిగి పుట్టింటికి వెళ్లింది.. మూడు రోజులు సెలవియ్యాలంటూ లేఖ !

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : భార్యభర్తల్లో తరచూ గొడవలు సర్వసాధారణం. కొందరు అప్పటికప్పుడే సర్దుకుపోతారు. మరికొందరు ఒకటి, రెండు రోజుల్లో మరిచిపోతారు. కానీ కొందరు పంతాలు, పట్టింపులకూ పోయి ఎడబాటుకు లోనవుతారు.

ఇక్కడా ఇదే జరిగింది. భార్య పుట్టింటికి వెళ్లింది.. ఆమెకు సర్ది చెప్పి తీసుకు రావడానికి మూడు రోజులు సెలవు కావాలని తన ఆఫీసులో పైఅధికారికి ఏకంగా ఓ ఉద్యోగి లేఖే రాశాడు. విచిత్రంగా, కొంత నవ్వు పుట్టించేలా ఉన్నా ఇది నిజం.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్ఫూర్ లో షంషాద్ అహ్మద్ బేసిక్ శిక్షా అధికారిగా పని చేస్తున్నాడు. భార్యా, ముగ్గురు పిలలతో హాయిగా ఉంటున్నారు. ఉన్నట్టుండి ఓ రోజు అహ్మద్, అతని భార్యకు చిన్న గొడవ జరిగింది. దీంతో ఆమె తన ముగ్గురు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది.

ఈ సమయంలో అహ్మద్ తీవ్ర వ్యథకు గురయ్యాడు. భార్యాపిల్లలు చెంత లేకపోవడంతో మదన పడ్డాడు. దీంతో ఎలాగైనా బతిమాలుకొని తీసుకొచ్చుకుందామని నిర్ణయించుకున్నాడు.

వెంటనే తను పనిచేసే కార్యాలయానికి వెళ్లి ఉన్నతాధికారికి లీవ్ లెటర్ ఇచ్చాడు. తనతో గొడవ జరిగి తన భార్య పుట్టింటికి వెళ్లింది. సర్ది చెప్పుకొని తీసుకొచ్చేందుకు తనకు మూడు రోజుల సెలవులు కావాలని ఉన్నతాధికారికి లేఖ రాశాడు. ఇది కాస్తా బయటకు పొక్కి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.