రచ్చబండ, ప్రత్యేక ప్రతినిధి : మునుగోడు రాజకీయం రసవత్తరంగా మారింది. వారం రోజులుగా ఊగిసలాటలో ఉన్న ఉప ఎన్నిక విషయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నిర్ణయంతో పటాపంచలైంది. దీంతో రాజకీయ వేడి ఊపందుకుంది. ఆయా పార్టీలు అప్పుడే సమీకరణాలలో మునిగిపోయాయి.
తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు పల్లె రవికుమార్ గౌడ్ తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. జర్నలిస్టులను ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించడంలో కీలక పాత్ర వహించారు. ఆ దశలోనే కేసీఆర్ కు చేరువయ్యారు. ఆయన మెచ్చుకున్న ఉద్యమకారుడిగా గుర్తింపు పొందారు.
రాష్ట్రావిర్భావం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు. ఆయనకు ఏదైనా పదవి వస్తుందని అందరూ ఆశించారు. ఎమ్మెల్సీగా తీసుకుంటారని ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత ఏమైందో కానీ ఎలాంటి పదవీ దక్కలేదు.
అసంతృప్తితో ఉన్న పల్లె రవికుమార్ గౌడ్ అనంతరం పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన సతీమణి పల్లె కల్యాణి కాంగ్రెస్ పార్టీ నుంచి చండూరు ఎంపీపీగా ఎంపికయ్యారు. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు.
తాజా రాజకీయ పరిణామాల్లో పల్లె రవికుమార్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. మునుగోడు నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్నారు. ఈ దశంలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీసీ నేతకు ఇవ్వాలనే సూచనలు వెల్లువెత్తాయి.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా బీసీ నేత కోసం వెతుకులాటలో పడింది. దీంతో మొదటి దశలోనే పల్లె రవికుమార్ పేరు పరిశీలనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు పోటీనిచ్చే సరైన అభ్యర్థి పల్లె రవికుమార్ అని భావిస్తున్నారు.
ఆయన సొంత సామాజిక వర్గంతో పాటు ఇతర బీసీ కులాలు కూడా ఆయనకు మద్దతుగా నిలిచే అవకాశముందని భావిస్తున్నాయి. అదే విధంగా తెలంగాణ ఉద్యమకారుడిగా ఆయనకున్న ఇమేజీ ఎన్నికల్లో ఉపకరిస్తుందని అగ్రనేతలు భావిస్తున్నారు.
మరో ఆసక్తికరమైన సమాచారంపై కూడా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ బీసీ నేత వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఈ దశలో బీసీ నేతగా, ఉద్యమకారుడిగా గుర్తింపు ఉన్న పల్లె రవి విషయమై పరిశీలించాల్సిందిగా కొందరు ముఖ్యులను సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని టికెట్ ఇస్తే గెలుపు అవకాశాలను ఆరా తీయాలంటూ కేసీఆర్ పేర్కొన్నారని తెలిసింది.