‘రచ్చబండ’ చెప్పినట్టే కోమటిరెడ్డి ఒక్క పూటలోనే రియాక్ట్

రచ్చబండ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నిర్ణయంతో ఆయన సోదరుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో సంకట స్థితి ఏర్పడిందని ‘రచ్చబండ’లో ప్రత్యేక కథనం వచ్చింది. దీనిపై ఆయన వైఖరి ఎలా ఉండబోతోందంటూ అనుమానం వ్యక్తమైంది.

రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ వ్యాఖ్యలను వెంకట్ రెడ్డి ఎలా జీర్ణించుకుంటారోనన్న కథనం ఇచ్చింది. ఒకే వేదికపై ఉంటే సోదరుడిపై కాంగ్రెస్ నేతల ఆగ్రహాన్ని సహిస్తారా.. లేదా.. అన్న అనుమానం వ్యక్తం చేసింది.

అయితే కథనం వచ్చిన ఒక్కపూటలోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కోమటిరెడ్డి బ్రదర్స్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ పదవులు ఇవ్వకుంటే బ్రాందీ షాపులు పెట్టుకునేవారు అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నారా, అన్యమనస్కంగా అన్నారా అన్నది తేలాల్సి ఉంది. అయితే దీనిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

తమ కుటుంబంపై రేవంత్ వ్యాఖ్యలు తనను బాధించాయని, వాటిని వెనక్కి తీసుకోవాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. వెంటనే రేవంత్ క్షమాపణ చెప్పాలని అన్నారు.

ఉప ఎన్నికలో కలిసి వెళ్లేదాకా కూడా ఆగకుండానే ఆదిలోనే రేవంత్ వైఖరిని వెంకట్ రెడ్డి ఖండించడంపై కాంగ్రెస్ వర్గాల్లో కలవరం నెలకొంది. అలా అని ఉండాల్సింది కాదు.. అని వెంకట్ రెడ్డి వర్గీయులు అంటుండగా, అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ రేవంత్ వర్గీయులు అభిప్రాయ పడుతున్నారు.

కాంగ్రెస్ అగ్రనేతల నడుమ నెలకొన్న ఈ ఘర్షణ వైఖరి ఎక్కడిదాకా వెళ్తుందోనని కేడర్ లో అయోమయం నెలకొంది. ఆ పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ఎటువైపు దారితీస్తుందోనని కూడా ఆందోళన నెలకొంది.