రచ్చబండ, ప్రతినిధి : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ పెద్దలతో ఫ్యామిలీ ప్యాక్ గురించి చర్చించారా.. ఆ మేరకు బీజేపీ అధిష్టానం కూడా అంగీకరించిందా.. కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తి కోమటిరెడ్డి బ్రదర్స్ ను కమలం వైపు నడిపిస్తుందా.. అంటే నిజమే కావచ్చనే సంశయం లేవనెత్తింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానన్న నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ వెంటనే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇతర నేతలు ఘాటుగా స్పందించారు. రాజగోపాల్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం వరకూ దారితీసింది.
ఇదిలా ఉండగా సోదరుడి వైఖరిపై స్పందించని వెంకట్ రెడ్డి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఘాటాగా స్పందించారు. దీంతో ఇటీవలే రేవంత్ కు చేరువైన ఆయనకు మళ్లీ దూరం పెరిగినట్లయింది.
దీనికి తోడుగా తన సోదరుడిపై కాంగ్రెస్ నేతల తీరుపై రగిలిపోతున్నట్లు తెలిసింది. సోదరుడితో పాటు వెంకట్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి పొమ్మనలేక పొగబెట్టిందా అన్న అనుమానం కలుగుతోందని ఆయన వర్గీయులు అంటున్నారు.
ఇదిలా ఉండగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా కాంగ్రెసుకు దూరమవుతారని, వారి వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశముందంటూ కొందరు సీనియర్లు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదులు చేసినట్లు వెల్లడైంది.
వీటన్నింటి పర్యవసానానికి తోడు మరో ఆశ్యర్యకర విషయం చర్చకు దారితీసింది. ఇటీవల రాజగోపాల్ రెడ్డి బీజేపీ అగ్రనేత అమిత్ షాతో చర్చలు జరిపారన్నది తెలిసిందే. అయితే అదే సందర్భంగా ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వ పథకాలను ఆయన మెచ్చుకున్నారని పేర్కొన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ బీజేవైపు మొగ్గు చూపుతున్నారనడానికి ఇదొక నిదర్శనం.
సోదరులిద్దరం బీజేపీలోకి వస్తే ఏంటి.. తమ ప్రాతినిథ్యం ఏమిటి.. తమ పాత్ర ఎలా ఉండబోతుంది.. అన్న అంశాలపైనా రాజగోపాల్ రెడ్డి చర్చలు జరిపినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానికి బీజేపీ అధిష్ఠానం కూడా వారి కోర్కెలు తీర్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజాగా రేవంత్ రెడ్డిపై వెంకట్ రెడ్డి ఘాటాగా స్పందించడం పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోదరుడితో పాటు పార్టీ మారడానికే వెంకట్ రెడ్డి కూడా సిద్ధమయ్యారా.. అన్న అనుమానం అందరిలోనూ కలుగుతోంది.