కన్నుమూసిన ‘ఆ కటిక పేద’

• శ్మశానంలోనే ప్రాణాలిడిసిన లక్ష్మణాచారి
• కదిలొచ్చిన మానవతామూర్తులు
• బియ్యం, సరుకులు అందజేత
• తాత్కాలిక ఇల్లు నిర్మిస్తామని హామీ
• ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

వెంకటాపూర్ (రామప్ప) : ‘‘కటిక పేదయై.. కాటికి చేరువై’’న ఆ నిర్భాగ్యుడు కన్నుమూశాడు. శ్మశానం వద్దే కొన ఊపిరితో ఉన్న ఆయన ప్రాణాలిడిశాడు. వెన్నెముక వ్యాధితో బాధపడుతూ ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన కేసోజు లక్ష్మణాచారి గురువారం తెల్లవారుజామున మరణించాడు.

కడు నిరుపేద కుటుంబానికి చెందిన లక్ష్మణాచారి నిలువ నీడ లేక అద్దె ఇంటిలో నివాసముంటున్నాడు. లక్ష్మణాచారి తన ఇంట్లో చనిపోతే కీడు సోకుతుందని ఇంటి యజమాని ఖాళీ చేయించాడు.

అగమ్య గోచరమైన పరిస్థితిలో కుటుంబ సభ్యులు లక్ష్మణాచారిని కొన ఊపిరితో శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడే కొట్టుమిట్టాడుతూ లక్ష్మణాచారి మరణించడంతో పలు హృదయాలను కలిచివేసింది.

అండగా నిలిచిన మానవతామూర్తులు
నిఘా దినపత్రికలో, రచ్చబండ వెబ్లో సైట్లో వచ్చిన కథనంతో విశ్వబ్రాహ్మణ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూరెళ్ల రామాచారి, ములుగు జిల్లా అధ్యక్షుడు ఎల్కతుర్తి రాజన్న గురువారం వెంకటాపూర్ కు వచ్చారు. లక్ష్మణాచారి మృతికి సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ సందర్భంగా రామాచారి మాట్లాడుతూ నిలువ నీడ లేక వెన్నెముక వ్యాధితో బాధపడుతూ లక్ష్మణాచారి మరణించడం చాలా బాధాకరమని పేర్కొన్నారు. లక్ష్మణాచారి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.50 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు.

త్వరలోనే కుటుంబ సభ్యులకు తాత్కాలికంగా రేకుల షెడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా లక్ష్మణాచారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరయ్యే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని రామాచారి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బెజ్జంకి రమేష్, మండల అధ్యక్షుడు కందోజు సత్యనారాయణ, కూరెళ్ల సాంబయ్య, ఎర్రోజు శ్రీనివాస్, కూరెళ్ల రవీంద్రాచారి, కూరెళ్ల రాజన్న, కస్తూరి ఆచారి, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.