హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు హైదరాబాద్ నగరంలో ఇదే నెలలో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు.
రెండు రోజులపాటు జరిగే ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొనే వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. హైదరాబాదులోని మహిళా జర్నలిస్టులు మీడియా అకాడమీ మేనేజర్ ఏ.వనజ (సెల్ నె.7702526489)ను, జిల్లాల్లో పనిచేసేవారు ఆయా జిల్లాల పౌరసంబంధాల అధికారి కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.
మొదటిరోజు రాష్ట్ర మహిళా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, శాసనసభ్యులు ఈ శిక్షణ తరగతుల్లో ప్రసంగిస్తారు. రెండో రోజు జాతీయ స్థాయిలో నిష్ణాతులైన మహిళా జర్నలిస్టులు ప్రసంగిస్తారు.
ఈ శిక్షణా తరగతుల్లో మొదటి రోజు “మహిళా జర్నలిస్టులు – ప్రధాన స్రవంతి మీడియా – మహిళల పాత్ర” అనే అంశంపై ప్రసంగం ఉంటుంది. “పాత్రికేయ రంగంలో మహిళలు – ప్రత్యేక సమస్యలు” అనే అంశంపై ప్రసంగాలు ఉంటాయి.
రెండవ రోజు “మహిళా అస్తిత్వం – జెన్డర్ సెన్సిటైజేషన్ “ అనే అంశం, “ఫీచర్ జర్నలిజం – మెళకువలు” అంశాలపై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నిష్ణాతులైన వారి ప్రసంగాలు ఉంటాయి. ఈ తరగతులలో అకాడమీ ప్రచురణలు మహిళా జర్నలిస్టులకు ఇస్తారు.
మార్చి 26, 27 తేదీల్లో మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత జర్నలిస్టుల శిక్షణ తరగతులు విజయవంతంగా జరిగాయని, దాదాపు 2,000 మంది దళిత జర్నలిస్టులు రాష్ట్రం నలుమూలల నుంచి తరగతులకు వచ్చారని చైర్మన్ గుర్తు చేశారు. ఈ సమావేశంలో మేనేజర్ ఎ.వనజ, శ్రీ అక్కౌంట్స్ అధికారి ఎం.పుర్ణచందర్ రావు పాల్గొన్నారు.