యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనాలి

• లింగాల కమల్ రాజు, కొండబాల కోటేశ్వరరావు

మధిర : రాష్ట్రంలో పండిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మధిరలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.

తెలంగాణ ప్రాంతం ఒకప్పుడు కరువుకు నిలయంగా ఉండేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్మించి తెలంగాణ భూములను సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న విధానం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు.

రైతుల సమస్యలపై తమ పార్టీ కేంద్రంపై ఒత్తిడి చేస్తుంటే, కాంగ్రెస్ ఎంపీలు మాత్రం మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వoతో చర్చించాల్సిన బిజెపి ఎంపీలు బాధ్యతలు విస్మరించి రాష్ట్ర ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ చిత్తారు నాగేశ్వరావు, మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత, ఎంపీపీ మెండెం లలిత, టీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు రావురి శ్రీనివాస రావు, కనుమూరు వెంకటేశ్వరరావు, కార్యదర్శులు అరిగే శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్ రెడ్డి, రైతుబంధు కన్వీనర్ వేణుబాబు, శీలం వెంకటరెడ్డి పాల్గొన్నారు.