తమ్ముడిపై మమకారం.. పార్టీపై అభిమానం.. కాంగ్రెస్ పార్టీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిది సంకట స్థితి

రచ్చబండ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆ పార్టీలో సంకట స్థితి ఏర్పడింది. తాజాగా ఆయన సోదరుడు, మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి, తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఎటూ పాలుపోని పరిస్థితి నెలకొంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎవరిపైనా ఆరోపణలు చేయలేదు. పార్టీ అన్నా, సోనియా అన్నా తనకు గౌరవముందని చెప్పారు. పీసీసీ పదవి విషయంలో, పదవుల నియామకాల విషయంలో తమను సంప్రదించలేదన్న ఆవేదన ఉందని తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడానికే తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా నిర్ణయం తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంట్రాక్టుల కోసమే పార్టీ మారారంటూ చేసిన వ్యాఖ్యలపై దుమారం లేచింది. రాజగోపాల్ రెడ్డి మరో ప్రెస్ మీట్ పెట్టి తీవ్రస్థాయిలో రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఆయన బ్లాక్ మెయిలర్, చరిత్ర హీనుడు, అవినీతిపరుడు అంటూ తీవ్ర పదజాలాన్ని వాడారు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ప్రత్యారోపణలు చేస్తే అదే పార్టీలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎలా జీర్ణించుకుంటారోనని చర్చించుకుంటున్నారు. రేపు మునుగోడు ఉప ఎన్నిక విషయంలోనూ రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఒకే వేదికపై ఉంటే రాజగోపాల్ రెడ్డిపై రేవంత్ వ్యక్తిగత విమర్శలు చేస్తే కోమటిరెడ్డి జీర్ణించుకోగలరా.. అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా విషయంపై కోమటిరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఆయనపై కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చే వరకూ దారితీసింది. దీంతో సొంత తమ్ముడిపై కాంగ్రెస్ పార్టీ యావత్తు వ్యతిరేకతతో మసలుతోంటే కోమటిరెడ్డి వైఖరి ఎలా ఉంటుందోనన్న చర్చ సాగుతోంది.

సొంత తమ్ముడిపై మమకారం చంపుకోలేక, ఉన్న పార్టీని కాదనలేక వెంకట్ రెడ్డికి సతమతమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ సంకట స్థితిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైఖరిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.