ఆ ఇద్దరి బాటలో కేసీఆర్

• ఢిల్లీలో మరో తెలుగోడి ఆత్మగౌరవ బావుటా
నాడు ఎన్టీఆర్.. ఆతర్వాత చంద్రబాబు.. నేడు కేసీఆర్.. ఎవరు అవునన్నా, కాదన్నా.. ఢిల్లీ గద్దెపై ఎదురు తిరిగిన తెలుగు కాదు.. దక్షిణాదీ కాదు.. జాతీయ నేతలుగా ఎదిగారంటే అతిశయేక్తి కాదు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన ఎన్టీఆర్, చంద్రబాబుకు తీసిపోని రీతిలో నేడు ఏకంగా జాతీయ పార్టీనే స్థాపించిన కేసీఆర్ ఒకడుగు ముందుకేయడం గమనార్హం.

తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాజాగా జాతీయ పార్టీ ఏర్పాటుపై చకాచకా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దసరా పర్వదినం సందర్భంగా పార్టీ పేరు ప్రకటన, వెను వెంటనే ఢిల్లీలో జాతీయ కార్యాలయం ప్రారంభం, ఢిల్లీ వేదికగా సభ నిర్వహించి జాతీయ స్థాయి రాజకీయాలకు శంఖారావం పూరించేందుకు సిద్ధమయ్యారు.

కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత కేసీఆర్ కే ఆ పేరు దక్కింది. వారిద్దరూ కూటములకు సారధ్యం వహించగా, కేసీఆర్ ఏకంగా జాతీయ పార్టీ ద్వారా కేంద్ర రాజకీయాల్లోకి ప్రవేశించనున్నారు.

ఎన్టీఆర్, చంద్రబాబు ఇద్దరికీ ఢిల్లీ సింహాసనం ఎక్కే అరుదైన అవకాశం వచ్చింది. అయినా వారు ఆ అవకాశాన్ని వదులుకున్నారు. తాము సూచించిన వారినే ఆ సింహాసనంపై కూర్చొబెట్టి కీరోల్ పోషించారు.

స్వాతంత్ర్యానంతరం సుధీర్ఘకాలం అధికారం చెలాయించిన కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి 1977లో బీటలు వారాయి. అయితే అప్పడు ఏర్పడిన జనతా ప్రభుత్వం మూడేండ్లలోపే అధికారాన్ని కోల్పోయింది. అనంతరం 1989లో నేషనల్ ఫ్రంట్ పేరుతో కాంగ్రెసేతర ప్రభుత్వం వచ్చింది. దీనికి ఎన్టీఆర్ ప్రముఖ పాత్ర పోషించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర పార్టీల మద్దతు కూడగట్టడంలో ఆయనది కీలక పాత్ర ఉంది.

తెలుగోడి ఆత్మగౌరవం పేరిట తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అన్న, మాజీ మఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కేంద్రంపై కన్నెర్ర జేశారు. అప్పటి దాకా దక్షిణాది నుంచి ఏ ఒక్క నేత కూడా ఇలా తమ ఉనికిని చాటిన దాఖలాలు లేవు.

తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అప్పటికే కాంగ్రెసేతర పార్టీలు అధికారంలోకి వచ్చినా కేవలం తమ రాష్ట్రాలకే పరిమితమై పోయారు. కానీ ఎన్టీఆర్ మాత్రం కేంద్రం కర్ర పెత్తనంపై అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతోనే వైరం పెంచుకున్నారు. తెలుగోడి ఆత్మగౌరవం పేరిట ప్రజల్లో భావన కల్పించారు.

అనంతరం పరిణామాల్లో 1996లో యునైటెడ్ ఫ్రంట్ పేరుతో మరోసారి ప్రతిపక్షాల కూటమితో కూడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దేవెగౌడ ప్రధానమంత్రి అయ్యారు. దీనికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు ఆ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ప్రధాన పక్షాలను కూడగట్టడంలో ముఖ్య పాత్ర పోషించారు.

ప్రధానంగా నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ కీలక బాధ్యతల్లో ఎన్టీఆర్, చంద్రబాబు ఉండి ఢిల్లీలో చక్రం తిప్పారు. ఆయా కూటములు కొంతకాలమే అధికారంలో ఉన్నా, పూర్తిస్థాయి అధికారానికి ఫలితం రాకున్నా వారిద్దరూ తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటారు.

ఎన్టీఆర్, చంద్రబాబు తరహాలోనే నేడు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. నేడు ఆయన ఏకంగా జాతీయ పార్టీ ఏర్పాటుకు నడుం బిగించారు. కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వంపై పోరుకు శంఖారావం పూరించనున్నారు.

నాడు ఎన్టీఆర్, చంద్రబాబుకు నేడు కేసీఆర్ కు జాతీయ రాజకీయాల్లో కీలకమైన చాలా తేడాలు గోచరిస్తున్నాయి. నాడు కూటములు భావసారూప్యత కలిగిన పార్టీల కలయికతో ఏర్పడి అధికారాన్ని దక్కించుకున్నాయి. సమష్టి పోరాటంతో, ఎన్నికల్లో, అనంతరం ఒక్కటై కూటములుగా ఏర్పడ్డారు.

నేడు కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలే కాదు.. స్వాతంత్ర్యానంతర పాలకుల వైఖరులపైనే బాణం ఎక్కు పెట్టారు. ప్రజల ఈతిబాధలు, దేశ వనరుల వినియోగం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో వెనుకబాటు, అట్టడుగు వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న బాధలు, వారికి కావాల్సిన సంక్షేమ పథకాలు, ధరల భారంపై సమగ్ర కార్యాచరణతో సిద్ధమయ్యారు.

ఈ దశలో కేంద్రంలో బలమైన బీజేపీ సారధ్యంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. అత్యధిక రాష్ట్రాల్లోనూ ఆపార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఉదా: తమిళనాడులో స్టాలిన్ సారధ్యంలోని డీఎంకే, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాయి.

ఇలాంటి తరుణంలో కేసీఆర్ పాచిక పారుతుందా.. లేదా.. అన్న విషయాలు పక్కన పెడితే ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత మరో తెలుగోడు జాతీయ రాజకీయాల్లో సత్తా చాటేందుకు ముందుకొచ్చాడని మాత్రం చెప్పొచ్చు. ఫలితాలు ఎలా ఉన్నా తెలుగు ఆత్మగౌరవ పతాక మరోసారి జాతీయ స్థాయిలో రెపరెపలాడనుంది.


– బొమ్మకంటి బిక్షమయ్య గౌడ్