రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత తెలుగు సినీ ప్రపంచంలో వారి తర్వాత ఆరాధ్యుడిగా కొనియాడబడుతున్న నటుడు చిరంజీవి మాత్రమే అనడంలో అతిశయోక్తి కాదు. రాజకీయ విబేధాలు ఎన్నున్నా అతిరథ మహారథులు కూడా చిరంజీవికి సరైన గౌరవం ఇస్తుండటం పరిపాటి. ఒక విధంగా మాట్లాడాలంటే చిరంజీవి అజాత శత్రువు అనడంలో కూడా ఎవరికీ అభ్యంతరాలు లేవు.
ప్రముఖ అవధాని గరికపాటి నర్సింహారావు ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా భౌతికవాదానికి అనుగుణంగా చెప్తూ ప్రజల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. ఆయన చెప్పిన ఎన్నో ప్రవచనాలు ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉంటున్నాయి. దీంతో ఆయనకు ఎందరో అభిమానులుగా మారారు.
ఇలాంటి ఇద్దరూ కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి హైదరాబాద్ నగరంలో నిర్వహించిన అలయ్- బలయ్ కార్యక్రమంలో అతిథులుగా హాజరయ్యారు. ఒకరికొకరు ఆప్యాయతలు పంచుకున్నారు. మెచ్చుకున్నారు. అంతవరకు బాగానే ఉంది.
ఆ తర్వాత వేదికపైనే చిరంజీవితో ఫొటోలు దిగేందుకు అభిమానులు, నేతలు ఎగబడ్డారు. ఈ దశలో గరికపాటి అసహనానికి గురయ్యారు. ‘ఫొటోలు దిగే కార్యక్రమం బంద్ చేయాలి.. అలా అయితేనే నేను ఉంటా.. లేకుంటే నేను వెళ్లిపోతా.. చిరంజీవి గారు మీరు ఆ ఫొటోలు దిగే కార్యక్రమం బంద్ జెయ్యాలి. లేకుంటే నేను వెళ్తా.. అంటూ అసహనంతో గరంగరం అయ్యారు.
ఈ సమయంలో వెంటనే తిరిగి వచ్చిన చిరంజీవి గరికపాటితో చిరునవ్వులు చిందిస్తూ వేదికను పంచుకున్నారు. సజావుగా సాగింది. అయితే దీనిపై వివాదం రాజుకుంది. ఈ ఘటనను ఉద్దేశించి చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
‘‘ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటి’’ అంటూ నాగబాబు ట్విటర్ లో కామెంట్ చేశారు. దీంతో చిరంజీవి అశేశ అభిమానులు తీవ్రంగా స్పందించారు.
చిరంజీవి యూత్ అధ్యక్షుడు ఏకంగా గరికపాటికి ఫోన్ కాల్ చేసి చిరంజీవిని ఉద్దేశించి మీరు చేసిన కామెంట్ మమ్మల్ని బాధ కలిగించిందని గరికపాటితో అన్నారు. దానికి ఆయన తాను చిరంజీవితో మాట్లాడుతానని సెలవిచ్చారు.
చిరంజీవిని చిన్నపిల్లాడిగా భావిస్తూ, తక్కువ వ్యక్తిగా చూసి, హుందాతనాన్ని కోల్పోయి గరికపాటి మాట్లాడారని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
పద్మభూషణ్ బిరుదాంకితుడు చిరంజీవిని ఉద్దేశించి చులకనగా గరికపాటి మాట్లాడారంటూ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఏదేమైనా ఉత్తమ ప్రవచనాలు అందించే గరికపాటి ఇలా ఎందుకు మట్లాడారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.