పోలీసు కుటుంబాల ఆడపడుచుల సంబురం.. సూర్యాపేటలో వెన్నముద్ద బతుకమ్మ

రచ్చబండ : దేవుడిని పూజించేందుకు పూలను ఉపయోగిస్తామని, అలాంటి పూలనే పూజించే గొప్ప పండుగ బతుకమ్మ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమని సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద ఎనిమిదో రోజైన ఆదివారం పోలీసుల కుటుంబాల ఆడపడుచులతో నిర్వహించిన వెన్నముద్దల బతుకమ్మ ఉత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రతి యేటా ఆడపడుచులు రకరకాల పూలతో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను పూజించడం అభినందనీయమన్నారు. దేశ విదేశాల్లో తెలంగాణ ఉనికిని చాటే బతుకమ్మ ఉత్సవాలను పోలీసుల కుటుంబ ఆడపడుచులతో నేడు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

మహిళలు రేపు జరిగే సద్దుల బతుకమ్మ ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించుకోవాలని కోరారు. మహిళా రక్షణకు జిల్లా పోలీసు శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని వారి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్, పట్టణ ఎస్ఐలు క్రాంతికుమార్, శ్రీనివాస్, ఏఎస్ఐలు లవకుశ, శంకర్, మహిళా సిబ్బంది సునీత, బాలనాగమ్మ, సంధ్య, గురువమ్మ తదితరులు పాల్గొన్నారు.