జమిలి ఎన్నికల వైపే మొగ్గు? అటు వైపే కేంద్రం అడుగులు?

రచ్చబండ : ఈ సారి లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయా.. కొన్ని రాష్ట్రాల ముందుస్తు ఊహాగానాలకు తెరపడనుందా.. ఖర్చు తగ్గించుకునేందుకు ఎన్నికల సంఘం జమిలి ఎన్నికలే మేలనుకున్నదా.. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ వైపే అడుగులు వేస్తుందా.. అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.

లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు ఒకేసారి జరపాలన్న అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని తాజాగా కేంద్రం ప్రకటించడంతో ఒక్కసారిగా జమిలి ఎన్నికల అంశం మళ్లీ తెరలేసింది.

లోక్ సభలో ఎంపీ భగీరథ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు పార్లమెంట్ సమావేశాల్లో పైసమాధానం ఇచ్చారు.

జమిలి ఎన్నికల అంశంపై పార్లమెంటరీ స్టాండిం కమిటీ, కేంద్రం ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు మంత్రి రిజుజు వివరించారు.

స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికలోని కొన్ని ప్రతిపాదనలను, సిఫారసులను లా కమిషన్ అధ్యయనం చేస్తోందని, అనంతరం ఒక ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నమైందని తేల్చారు.

వరుసగా వచ్చే ఎన్నికలు ప్రజా జీవనంపై ప్రభావం చూపుతున్నాయని స్టాండింగ్ కమిటీ నివేదికలో పేర్కొంది. లోక్ సభ, అసెంబ్లీలలకు వేర్వేరుగా ఎన్నికలు జరుగుతుండటంతో భారీగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తెలిపింది.. అని చెప్పారు.

2014-22 సంవత్సరాల కాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ నిమిదేళ్లలో ఎన్నికల నిర్వహణపై రూ.7వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది.. అని మంత్రి పేర్కొన్నారు.

ఆయా అంశాలను బట్టి వచ్చే లోక్ సభ ఎన్నికలు జరిగే నాటికి ఒక ఏడాది ముందు, అనంతరం ఏడాది లోపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించే అవకశాముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రధానంగా కేంద్రంలోని అధికారిక బీజేపీ జమిలి ఎన్నికలకే మొగ్గు చూపుతుందని ఆ పార్టీ కీలక నేతలు సైతం తరచూ ప్రకటనలు చేస్తుండటం దానికి బలం చేకూరుతుంది.