Jai Sreeram.. శంకర్ పల్లిలో మిన్నంటిన జై శ్రీరామ్ నినాదాలు 

Jai Sreeram.. శంకర్ పల్లిలో మిన్నంటిన జై శ్రీరామ్ నినాదాలు

* భక్తి శ్రద్ధలతో రామభక్తుల శోభాయాత్ర

 

రచ్చబండ, శంకర్ పల్లి: అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా సోమవారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణంలో ఘనంగా భక్తులు సీతారాముల విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించారు. సోమవారం ఉదయం విఠలేశ్వర హనుమాన్ మందిరం నుండి శోభాయాత్ర ప్రారంభమైంది. పట్టణంలోని పురవీధుల గుండా శోభాయాత్ర స్థానిక రైల్వే యార్డులో గల శ్రీరాముని దేవాలయం వరకు కొనసాగింది. కోలాటాలతో, డప్పు నృత్యాలతో ఆనందోత్సవాలతో శోభాయాత్ర కొనసాగింది.

వందల సంఖ్యలో మహిళలు, యువకులు ఈ శోభాయాత్రలో పాల్గొని నృత్యాలు చేశారు. రామాలయ ప్రాంగణంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించడానికి ఉత్సవ కమిటీ వారు ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాణప్రతిష్ట గావించిన దృశ్యాలను చూసి భక్తులు పరవశమై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. వచ్చిన భక్తులకు స్థానిక కిరాణా మర్చంట్ అసోసియేషన్ వారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శంకర్ పల్లి మండలంలోని అన్ని గ్రామాలలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహించారు. శంకర్ పల్లి పట్టణంలో పుర ప్రముఖులతో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.