ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖాయమైందా.. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎప్పటి నుంచో ఉన్న ఊహాగానాలకు తెరపడే రోజు దగ్గర పడిందనే చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీతో శనివారం ప్రశాంత్ కిషోర్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్ ముఖ్య నేతలు కేసీ వేణుగోపాల్, మల్లికార్జన ఖర్గే ఇతర ముఖ్యులు కూడా హాజరవడం గమనార్హం.
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారనే ఊహాగానాలు ఊపందున్న తరుణంలో ఈ సమావేశం జరగడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠకు తెరలేసింది. అయితే ఈ సమావేశంలో ప్రశాంత్ కిషోర్ చేరిక విషయమై సుధీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు ఆయన చేరిక ఖాయమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల పరాజయంతో పాటు అనేక కీలక అంశాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలు, పటిష్టతపై చర్చించినట్లు సమాచారం. గుజరాత్ ఎన్నికలపైనా విస్త్రతంగా చర్చించినట్లు తెలుస్తోంది.