విజయ సంకల్ప సభలో పొంగులేటికి చుక్కెదురు!

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డికి చుక్కెదురైంది. ఆయన వ్యవహరించిన తీరుపై ఒక్కసారిగా ప్రధాని మోడీ అవాక్కయ్యారు. ఆయన తీరుపై ప్రధాని అభ్యంతరం వ్యక్తం చేశారు.

సభా వేదికపైకి వచ్చిన ప్రధాని మోడీ అటూ ఇటూ తిరుగుతూ అటు నేతలకు, ఇటు ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఎదురుగా వచ్చిన పొంగులేటి ప్రధాని మెడలో శాలువా కప్పబోయారు. ఒక్కసారిగా అవాక్కయిన ప్రధాని దానిని సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆయన పక్కకు తప్పుకున్నారు.

వాస్తవంగా భారీ సభలో ప్రధానికి సన్మానం ఎవరు చేయాలో ముందుగానే చెప్తారు. అయితే తెలిసి చేశారో, తెలియక చేశారో కానీ పొంగులేటి వైఖరిపై ఆ పార్టీ నేతల్లో కూడా కొంత అసంతృప్తి నెలకొంది.

అనంతరం మోదీ ఆసీనులయ్యాక ముందస్తుగా నిర్ణయించిన ప్రకారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు.