Amangal Muncipality.. పైసలియ్యకుంటే ఫైలు కదలదు

  • ఆమనగల్లు మున్సిపాలిటీలో ఓ ఉద్యోగి దందా

రచ్చబండ, ఆమనగల్లు : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపల్ కార్యాలయంలో అవినీతి దందా రోజురోజుకూ మితిమీరిపోతున్నదని పట్టణ ప్రజలు వాపోతున్నారు. చిన్న పామును పెద్దకర్రతో కొట్టాలన్న చందంగా చిన్న పనికి కూడా పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేయడం ఆ ఉద్యోగి స్టైల్ అని చెవులు కొరుక్కుంటున్నారు.

డబ్బు ముట్టనిదే చిన్న పని కూడా జరగని పరిస్థితి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ప్రజా ప్రతినిధులకు, కౌన్సిల్ కు కార్యాలయంపై పట్టులేకపోవడంతో ఆ ఉద్యోగి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నాడని బహిరంగంగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఇంటి పన్ను తక్కువగా ఉన్నా ఎక్కువ మొత్తంలో బాధితుల నుంచి జమ చేసుకుంటూ, ఇంటి నెంబర్ కావాలంటే ఆ ఉద్యోగికి లంచం ముడితేనే పని అవుతుంది. ఇంటి పన్ను విషయానికి వస్తే వ్యాపార దుకాణాలకు సైతం లంచం ముడితే ఇంటి పన్నుగానే పరిగణిస్తాడు. కొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటున్నట్టు స్థానిక ప్రజలు లబోదిబోమంటున్నారు.

పని నిమిత్తం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాలంటేనే పట్టణ ప్రజలు జంకుతున్నారు. ఆమనగల్లు మున్సిపల్ కార్యాలయంలో అవినీతి దందాకు తెరలేపిన ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని బాధితులతో పాటు పలువురు పట్టణవాసులు కోరుతున్నారు.

కౌన్సిలర్ల సహకారంతోనేనా??

ఆమనగల్లు మున్సిపల్ పాలకవర్గంలోని కొంతమంది కౌన్సిలర్ల సహకారంతోనే ఆ ఉద్యోగి ఈ అవినీతి దందాకు తెరలేపినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆ ఉద్యోగి దందాపై ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంతో పట్టణ ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.