ఈ భోజన పద్ధతులు పాటిస్తే.. మీ ఆరోగ్యం.. మీ చేతుల్లోనే..

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : ఆయుర్వేదంలో ఒక సామెత లేదా సూక్తి ఉంది. అది ఏంటంటే.. ఏకకాల భోజనే మహాయోగి, ద్వికాల భోజనే మహా భోగి, త్రికాల భోజనే మహా రోగి.. అని.. దీన్నిబట్టి ఆయుర్వేదం మనం తీసుకునే ఆహారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చూడండి. ప్రతీ ఒక్కరూ నియమిత సమయంలో నియమిత ఆహారాన్ని తీసుకోవడం వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు. మరి ఎలాంటి నియమిత ఆహారం తీసుకోవాలో పూర్తిగా తెలుసుకుందాం రండి..

వివిధ ఆయుర్వేద గ్రంధాల్లో భోజన పద్ధతుల గురించి వివరించారు. రుషులు కూడా సక్రమమైన భోజన పద్ధతులు పాటిస్తూ పరులకు బోధించేవారు. మనం తీసుకునే ఆహారం, పద్ధతులు, వేళల వల్లే సగానికి పైగా జబ్బులు వస్తాయని ఆయా గ్రంథాలు, చెప్తున్నాయి.

ముఖ్యంగా మనం తీసుకునే ఏ పదార్థమైనా మోతాదుగా తీసుకోవాలి. మోతాదుగా తీసుకోవడం వల్ల జఠరాగ్నిని దీపనం చెందిస్తుంది. దీపనం అంటే తిన్న ఆహారం జీర్ణమయ్యేలా, మళ్లీ ఆకలి అయ్యేలా చేస్తుంది. గట్టిగా ఉండే పదార్థాలను తినగలిగినంత మాత్రమే తీసుకోవాలి. లఘు పదార్థాలను కడుపు నిండా అంటే ఇక తినలేము అన్నంత అధికంగా తినకూడదు. అంటే మూడు వంతులు తిని, కడుపులో ఒక వంతు ఖాళీగా ఉంచాలి. మోతాదుకు తక్కువగా కూడా భుజించకూడదు.

దానివల్ల శరీరం యొక్క బలం, ఓజస్సు, పుష్టి నశిస్తుంది. అతి తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకుంటే వాత, పిత్త రోగాల భారిన పడే అవకాశం ఉంది. దాంతో పాటు త్వరగా అలిసి నీరసం ఆవరిస్తుంది. బలహీనత వంటి సమస్యలూ వస్తాయి. ఒక్కోసారి అవి ప్రాణాంతకమూ కావచ్చంట. పదార్థాలను అధికంగా భుజించడం ఒక్కటే దోషం కాదు.

ఇష్టం లేని పదార్థాలను తినడం, కడుపుబ్బరం కలిగించే పదార్థాలు తీసుకోవడం, సరిగ్గా పక్వానికి రాని పండ్లు, కాయలు తినడం, గట్టిగా ఉండి అరుగుదలకు సమయం పట్టే పదార్థాలు, బాగా కారంగా ఉండేవి, చల్లబడి పోయినవీ, అశుచిగా ఉండేవి, దాహాన్ని అధికంగా చేసేవి, ఆరిపోయి గట్టిగా అయినవి, నీల్లలో ఉన్నవి మొదలైన పదార్థాలు జీర్ణం కావు. జాగ్రత్తగా వినండి మనం దుఃఖంలో ఉన్నప్పుడు, భాగా కోపంలో ఉన్నా కానీ, భయం చెంది ఉన్నప్పుడు కానీ తన్న పదార్థాలు కూడా జీర్ణం కావు.

ఇక భోజనం చేసిన తర్వాత అది పూర్తిగా అరగక ముందే మళ్లీ భుజించరాదు. సమయం కాని సమయంలో, కాస్తే కదా అని ఎక్కవ ఆహారం తినరాదు. మల మూత్రాలు సంపూర్ణంగా బయటకు వెళ్లినప్పుడు, హృదయం నిర్మలమైనప్పుడు, వాత, పిత్త, కఫం స్వస్థానం నందు ఉన్నప్పుడు, త్రేన్పులు లేనప్పుడు, బాగా ఆకలి అవుతున్నప్పుడు, శరీరం తేలికగా ఉన్నప్పుడు మాత్రమే భుజించాలి.

అసలు భోజనం చేసే ముందు మనం ఏం పాటించాలో స్పష్టంగా ఉంది.. అది ఏంటంటే? భోజనానికి ముందు స్నానం చేసి శుచిగా తయారవ్వాలి. బాలురు, అతిథులు ఉంటే వారిని సంతృప్తి పర్చి, పెంచుకునే పశుపక్షాదులకు ఆహారం అందించి మనఃశుద్ధి కలిగి ఎవరినీ నిందించకుండా తనకు హితమైనది, తనయందు భక్తిభావం కలిగిన వారు పెట్టిన ఆహారాన్ని భుజించాలి.. అన్నమాట.

ఉదరాన్ని నాలుగు భాగాలుగా విభజించి రెండు భాగాలను ఆహార పదార్థాల చేత, ఒక భాగం ద్రవ పదార్థాల చేత, నాలుగో భాగం వాయుప్రసారానికి అనువుగా ఖాళీగా ఉంచాలి.

భోజనం అయిన వెంటనే చేయకూడని పనులేంటో తెలుసుకుందాం.. భోజనం అయిన వెంటనే చదువడం చేయొద్దు.. నడవడం, పడుకోవడం, ఎండలో నిల్చోవడం, అగ్నికి సమీపాన ఉండటం, వాహనాలు ఎక్కడం, నీటిలో ఈదడం, ఎగిరి దాటడం వంటివి చేయకూడదు.

పైన చెప్పిన నియమాలు ప్రతి ఒక్కరూ పాటిస్తే మంచి ఆరోగ్యవంతులు అవుతారని ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది.