• ఏ పార్టీకెంత మంది ఎమ్మెల్యేలు.. • పార్టీల బలాబలాలు
రచ్చబండ :మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం పతనం అంచున ఉందా.. ప్రస్తుత ప్రభుత్వానికి చివరి రోజులేనా.. శివసేన లుకలుకలే పతనానికి దారితీశాయా.. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో బీజేపీ లాభపడుతుందా.. అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి.
మహారాష్ట్రలో 2019 ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలతో కూడిన మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది.
ప్రస్తుతం శివసేన పార్టీ నుంచి మంత్రి ఏక్ నాథ్ షిండే తిరుగుబాటు చేశారు. సుమారు 39 మందికి ఎమ్మెల్యేలతో వేరు కుంపటి పెట్టి అదృశ్యమయ్యారు. సూరత్ లోని మెర్సిడియన్ హోటల్ లో మకాం పెట్టారని సమాచారం. అక్కడి నుంచి అస్సాం వెళ్లారంటూ వార్తలు షికారు చేశాయి.
ఇదేరోజు షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలిసి తమ మద్దతును ఉపసంహరించుకునే అవకాశముందని సమాచారం. తమదే అసలైన శివసేన అంటూ ఏక్ నాథ్ షిండే గ్రూప్ అంటుందని తెలిసింది. ఇదే నిజమైతే అఘాడీ సర్కారు మైనారిటీలో పడే అవకాశముంది.
ఈ దశలో అసలు ఏ పార్టీకి బలమెంతో చూద్దాం. రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య 288 మంది. ప్రభుత్వ ఏర్పాటుకు 144 మంది సభ్యుల బలం కావాలి. వీరిలో మహా వికాస్ అఘాడీ కూటమి 169 మంది ఎమ్మెల్యేలతో ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 113 మంది బలముంది.
మహా వికాస్ అఘాడీ కూటమిలో శివసేనకు 56, ఎన్సీపీ 53, కాంగ్రెస్ 44, బీవీఏ 3, ఎస్పీ 2, పీజేపీ 2, పీడబ్ల్యూపీ 1, ఇండిపెండెంట్లు 8 మంది సభ్యుల బలముంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీకి 106 మంది ఆర్ఎస్పీ 1, టీఎస్ఎస్ 1, ఇండిపెండెంట్లు ఐదుగురి మద్దతు ఉంది.
అఘాడీ కూటమి నుంచి 39 మంది వేరు కుంపటితో దాని బలం 130కి చేరుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా బీజేపీకి మద్దతిచ్చినా, వీరే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ మద్దతు కోరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ రెండింటలో ఏదో ఒకటి జరిగే అవకాశముంది.
ఇదిలా ఉండగా శివసేన శాసనసభా పక్ష నేతగా ఏక్ నాథ్ షిండేను తొలగిస్తూ ఆ పార్టీ ప్రకటన వెల్లడించింది. అదే విధంగా ఏక్ నాథ్ షిండే తన ట్విట్టర్ ఖాతాలో మంత్రి అన్న పేరును తొలగించారు. సాయంత్రం విలేకరుల సమావేశం ఉన్నట్లు అఘాడీ కూటమి నేతలు వెల్లడించారు. దీన్నిబట్టి ప్రభుత్వం రద్దు చేసే యోచనలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.
మరో విషయమేమంటే.. అఘాడీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని శివసేన అధినేత, సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి అఘాడీ ప్రభుత్వం ఉంటుందా.. ఊడుతుందా.. అన్న విషయం మరికొన్ని గంటల్లో తేలనుంది.