మధ్యప్రదేశ్ లో మరో దారుణం.. కాబోయే భర్త కళ్లెదుటే యువతిపై సామూహిక లైంగికదాడి

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : యూపీలో లైంగికదాడికి గురై చెట్టుపై వేలాడుతూ తనువులు చాలించిన ముగ్గురు యువతుల ఘటనను మరువక ముందే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దుర్ఘటన చోటుచేసుకొంది. పట్టపగలు కాబోయే భర్త కళ్లెదుటే యువతిపై ఐదుగురు దుష్టులు లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. వారికి తగిన శాస్తి జరిపే పనిలో పోలీసులు ఉన్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాలోని ఓ గ్రామ పరిధిలోని ఆలయ సమీపంలో తనకు కాబోయే భర్తతో ఓ 17ఏళ్ల యువతి ముచ్చటిస్తుంది. ఈ సందర్భంగా మాటేసి ఉన్న ఐదుగురు దుండగులు ఆ యువతిపై కాటేశారు. కాబోయే భర్త ముందే సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

గత శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ దుండగుల నుంచి యువతి, యువకుడు ప్రాణాలతో బయట పడ్డారు. తమ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందనే భయంతో వారు బయటకు ఈ విషయాన్ని చెప్పలేదు. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారే చొరవ తీసుకొని విచారణ జరిపారు.

మొదట ఫిర్యాదు చేసేందుకు వెనుకాడిన బాధిత కుటుంబం, మహిళా పోలీసు అధికారుల కౌన్సెలింగ్ తో ఫిర్యాదు ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ముగ్గురిని రేవాలో, సోమవారం మిగతా ఇద్దరిని ముంబైలో అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ నవనీత్ బాసిన్ తెలిపారు. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.

ఈ ఘటనలో ముగ్గురు నిందితుల ఇళ్లను బుల్డోజర్ నేలమట్టం చేసిందని ఏఎస్పీ అనిల్ సోంకర్ తెలిపారు. మరో ఇద్దరి ఇళ్లను కూడా గుర్తించామని, త్వరలో బుల్డోజర్ చర్య ఉంటుందని తేల్చి చెప్పారు.